
అటవీ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
► పరిస్థితి విషమం.. నంద్యాల ఆస్పత్రికి తరలింపు
► ఉన్నతాధికారులు వేధిస్తున్నారంటూ సూసైడ్ నోట్
► జూనియర్‌కు పదోన్నతి కల్పించారని మనస్తాపం
► సూసైడ్ నోట్‌లో ముగ్గురి అధికారుల పేర్లు
గిద్దలూరు : ఉన్నతాధికారుల వేధింపులు తాళలేక అటవీ ఉద్యోగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో బంధువులు ఆయన్ను నంద్యాలలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి ముందు సూసైడ్ నోట్ కూడా రాశాడు. ఈ సంఘటన పట్టణంలోని రాచర్ల రోడ్డు ఎస్టీ కాలనీలో సోమవారం జరిగింది. గుండ్లకమ్మ రేంజి పరిధిలోని మాలకొండపెంట బీట్‌లో ఆర్.నరేంద్ర అనే యువకుడు ఏబీఓగా పనిచేస్తున్నాడు. తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి నరేంద్రను స్థానిక ఏరియా వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నంద్యాలకు తీసుకెళ్లారు.
నరేంద్ర రాసిన సూసైడ్ నోట్
కథనం ప్రకారం..
నరేంద్ర ఎఫ్‌బీఓగా పదోన్నతి పొందేందుకు సీనియారిటీ జాబితాలో ముందు వరుసలో ఉన్నాడు. ఆ పదోన్నతిని నరేంద్రకు కాకుండా డీఎఫ్‌ఓ సామాజిక వర్గానికి చెందిన మరొకరికి ఇచ్చారు. తనకెందుకు ఇవ్వలేదంటూ అతడు డీఎఫ్‌ఓను ప్రశ్నించాడు. ఇది మనసులో పెట్టుకుని కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులు ఎస్.నబీరసూల్, షేక్ ఖుద్దూస్, షేక్ నజీర్‌అహ్మద్‌లు ఈ నెల 7వ తేదీన నరేంద్రను కులం పేరుతో దూషించి గెంటేశారు. అదే రోజు అతడు ఆ ముగ్గురిపై స్థానిక పోలీసుస్టేషన్‌లో ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఫిర్యాదు చేశాడు. దీన్ని మనసులో ఉంచుకుని ఆ ముగ్గురు అధికారులు నరేంద్రపై డీఎఫ్‌ఓకు లేనిపోనివి చెప్పారు.
డిపార్ట్‌మెంటల్ విచారణల పేరుతో అధికారులు వేధించారు. పదోన్నతి రాకపోవడం.. వేధింపులు భరించలేక ఆయన తీవ్ర మనస్తాపం చెందాడు. సీనియర్ అయిన తనకు పదోన్నతి ఇవ్వలేదని నరేంద్ర సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. తక్కువ కులం వాడినంటూ హేళన చేశారని, తన చావుకు ఎస్.నబీరసూల్, ఖుద్దూస్, నజీర్‌అహ్మద్‌లని నరేంద్ర రాసిన సూసైడ్ నోట్‌లో ఉంది.