
చౌదరి రాజకీయమే అవినీతి
అవినీతి నిర్మూలనకు పని చేస్తున్నానంటూ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి ధ్వజమెత్తారు.
– రూ. కోట్లు విలువ చేసే మున్సిపల్ ఆస్తులను అమ్మేశారు
- హత్యా రాజకీయాలు చేస్తున్నదెవరు..?
- మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి
అనంతపురం : అవినీతి నిర్మూలనకు పని చేస్తున్నానంటూ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం స్థానిక వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి రాజకీయమే అవీనీతిమయం అన్నారు. మునిసిపల్ చైర్మన్‌గా ఉన్న సమయంలో విలువైన మున్సిపల్ ఆస్తులను తెగనమ్మేసిన చరిత్ర ఆయనదన్నారు. ఫ్యాక‌్షన్‌కు వ్యతిరేకంగా అవే సంస్థను ఏర్పాటు చేశానంటూ పైకి చెబుతున్నా లోలోప హత్యా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆయన కుటుంబ నేపథ్యమంతా ఫ్యాక‌్షన్‌తోనే ముడిపడి ఉందన్నారు.
ఇటీవల రుద్రంపేట వద్ద జరిగిన జంట హత్యల వెనుక ఎమ్మెల్యే ప్రోద్బలం ఉన్నట్లు ప్రచారం జరిగిందన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు శిల్పారామం ఏర్పాటుకు రూ. 5 కోట్లు నిధులు తెచ్చామన్నారు. అయితే ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత కాంట్రాక్టర్‌ను బెదిరించి పనులు ఆపించి ఆ తర్వాత పనులు ఏవిధంగా ప్రారంభించారో దానివెనుక జరిగిన గూడుపుఠాణి అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. జాతీయ రహదారిలో నేషనల్ హైవే అథారిటీ లైట్లు ఏర్పాటు చేస్తే వాటిని తానే ఏర్పాటు చేయించినట్లు చంకలు గుద్దుకుంటున్నారని మండిపడ్డారు. నగరంలో జరుగుతున్న ఇంటర్నల్ పైపులైను నిర్మాణం వెనుక ఎంత కమీషన్ దండుకున్నావో చెప్పాలని ప్రశ్నించారు. నడిమివంక, మరువవంక అభివృద్ధికి తమ హయాంలో తెచ్చిన నిధుల్లో మిగిలిన రూ. 17 కోట్లు ఈరోజు రిలీజ్ అయితే వాటిని తాము తెచ్చినట్లు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.
తాను ఎమ్మెల్యేగా, అనంత వెంకటరామిరెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో ఇంటర్నల్ పైపులైను, రైల్వే బ్రిడ్జి, శిల్పారామం, నడిమివంక, మరువ వంక అభివృద్ధికి నిధులు తెప్పించామన్నారు. ప్రస్తుత జిల్లా మంత్రులు, ఎమ్మెల్యే, మేయర్ ఎవరైనా నిధులు తెప్పించారా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా అనవసరమైన ఆరోపణలు మాని నగర అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, లేదంటే అన్ని వర్గాలకు అన్యాయం చేసి చరిత్రహీనుడిగా మిగిలిపోతావని హితవు పలికారు. నగర అధ్యక్షులు రంగంపేట గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ మిస్సమ్మ స్థలాన్ని బీఎన్‌ఆర్ కుటుంబం నిజాయితీగా టెండరు దాఖలు చేసి కొనిందనే విషయం అందరికీ తెలుసన్నారు. కేవలం రాజకీయంగా ఎదుర్కోలేక బురద జల్లుతున్నారన్నారు.