
ఇదేం రుణమాఫీ?
♦ రైతుకు నిష్ర్పయోజనం
♦ 20,848 మందికి నిరాశ
♦ అర్హులైనా అందని రూ.107.98 కోట్లు
♦ కలెక్టర్ నివేదిక బుట్టదాఖలు
నాడు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పంట రుణాలను ఏకకాలంలో మాఫీ చేశారు. రుణమాఫీ ద్వారా లబ్ధి పొందలేకపోయిన రైతులకు రూ.5,000 ప్రోత్సాహకం ఇచ్చారు.
నేడు
రుణమాఫీ ప్రకటించి రెండేళ్లయినా మీనమేషాలు లెక్కిస్తున్నారు. విడతల వారీగా మాఫీ వర్తింపజేస్తూ రైతులను మళ్లీ వడ్డీవ్యాపారుల వైపు నడిపిస్తున్నారు. రుణమాఫీకి అర్హత సాధించిన 20,848 మంది రైతులకు ఈ పథకం వర్తించకుండా పోయింది. రూ.107.98 కోట్లు మాఫీ కాకుండా పోయాయి.
ఖమ్మం వ్యవసాయం: జిల్లా కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ సంబంధిత రైతులు రుణమాఫీకి అర్హులని, వారి రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అయినా ఆ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం బుట్ట దాఖలు చేసింది. ప్రభుత్వం రుణమాఫీకి అర్హులుగా గుర్తించని రైతులు జిల్లాలో ఇంకా మరో 30 వేల మంది ఉంటారని అంచనా. వీరికి రూ. 30 కోట్ల మేరకు రుణాలు మాఫీ కావాల్సి ఉందని రైతు సంఘాలు అంటున్నాయి. రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న కొందరు అర్హులైన రైతుల రుణాలు కూడా మాఫీలో చేర్చలేదు. నివాసం ఒక రాష్ట్రంలో, భూమి మరో రాష్ట్రంలో ఉన్న రైతుల రుణాలు ఎటూ కాకుండా పోయాయి.
జిల్లాలో రుణమాఫీ ఇలా..
రూ.లక్ష లోపు పంట రుణాలు తీసుకున్న రైతుల్లో ఇంటికొకరిని అర్హులుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో తొలుత ప్రాథమికంగా 3,80,009 మంది రైతులను రుణమాఫీలో అర్హులుగా గుర్తించారు. వారికి 1,724.80 కోట్లు మాఫీ చేయాలని నివేదికలు రూపొందించారు. ఆ తర్వాత రెవెన్యూ, వ్యవసాయ, బ్యాంకింగ్ శాఖలను కమిటీలుగా చేసి ప్రభుత్వం రూపొందించిన నిబంధనల ప్రకారం తుది జాబితాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలో 3.58 లక్షల మం ది రైతులను అర్హులుగా ప్రకటించారు. రూ.1,637 కోట్లను రుణమాఫీలోకి చేర్చి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఈ నివేదికల ఆధారంగా ప్రభుత్వం మంజూరు చేసిన రైతుల వివరాలు, రుణ మాఫీల వివరాలు గ్రామపంచాయతీల్లో, బ్యాంక్ కార్యాలయాల్లో ప్రదర్శించారు.
అర్హత ఉన్నా మాఫీ వర్తించని రైతులు ప్రజా ప్రతినిధులను, బ్యాంక్ మేనేజర్‌లను, తహ సీల్దార్లను, వ్యవసాయాధికారులను, లీడ్ బ్యాంక్ మేనేజర్‌ను, జిల్లా వ్యవసాయాధికారిని, జిల్లా కలెక్టర్‌ను అనేక పర్యాయాలు కలిశారు. జిల్లాలో అర్హులై ఉండి మిగిలిన రైతుల వివరాలతో కూడిన జాబితాలను పంపాలని కలెక్టర్ వ్యవసాయశాఖను కోరారు. జిల్లా వ్యవసాయశాఖ 48 బ్యాంక్ బ్రాంచీల నుంచి 17,642 మంది రైతులు రుణమాఫీకి అర్హులని, వీరికి రూ.84.43 కోట్లు రుణమాఫీలో చేర్చాలని నివేదిక ఇచ్చింది. బంగారం తాకట్టుపెట్టి వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతులు జిల్లాలో 3,206 మంది ఉన్నారని.. రూ.23.55 కోట్లు రుణమాఫీలో చేర్చాలని నివేదికలు అందించారు. మొత్తం 20,848 మంది రైతులకు చెందిన రూ.107.98 కోట్లు రుణమాఫీలో చేర్చాలని జిల్లా కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వానికి గత ఏడాది జూన్ నెలలో నివేదిక ఇచ్చారు. రుణమాఫీ అందని రైతులు అటు కొత్త రుణాలకు కూడా నోచుకోలేకపోతున్నారు. ఇలా రెండు రకాలుగా నష్టపోతూ రుణదాతల నుంచి నూటికి రూ.5 వడ్డీ చొప్పున తీసుకుంటున్నారు.
మాఫీ విధానంపై రైతుల్లో అసంతృప్తి
పంట రుణాల మాఫీ విధానంపై రైతుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. జిల్లాలకు రుణమాఫీ నిధులు రూ.1,637 కోట్లు అందాల్సి ఉండగా వాటిని 25 శాతం చొప్పున విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాకు రూ.820.20 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. ఏటా వచ్చే నాలుగో వంతు రుణ మొత్తం పంటల పెట్టుబడులకు ఏ మాత్రం సరిపోవటం లేదు. ఆ రుణాలు కూడా వ్యవసాయ సీజన్‌లో అందటం లేదు. పంట సాగు చేసి పెట్టుబడులు పూర్తయ్యే దశలో అందుతున్నాయి.
అధిక వడ్డీలతో సెలమయ్య అవస్థలు
తల్లాడ మండ లం వెంకటగిరి గ్రామానికే చెందిన మరో రైతు దేవల సెలమయ్య కూడా ఏపీజీవీబీ నుంచి రూ.15వేలు రుణం తీసుకున్నాడు. రుణమాఫీ జాబితాలో ఈ సన్నకారు రైతు పేరు లేదు. తనకున్న కొద్దిపాటి భూమిలో పంట సాగు చేసేందుకు అప్పుకోసం మళ్లీ బ్యాంకుకు వెళ్లాడు. అప్పు ఉన్న వారికి మళ్లీ రుణం ఇవ్వమని అధికారులు తేల్చి చెప్పారు. దిక్కు తోచని సెలమయ్య అధిక వడ్డీకి అప్పు తెచ్చుకొని పంటకు పెట్టుబడి పెట్టాడు.
ప్రోత్సాహకం మంచి విధానం
వ్యవసాయంలో ప్రతికూలత, రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితులున్నప్పుడు ప్రోత్సాహక విధానాలను అమలు చేయటం మంచిది. ఇన్‌పుట్ సబ్సిడీ వంటి విధానాలు రైతులకు ఎంతో మేలు చేస్తాయి. రుణమాఫీ విధానంలో బ్యాంకులకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. రుణమాఫీలో ఉన్న రైతులైనప్పటికీ వారికి కేటాయించిన రుణ మాఫీని మాత్రమే తిరిగి రుణంగా ఇస్తాం. మిగిలిన మొత్తాన్ని రైతు చెల్లిస్తే తిరిగి కొత్త రుణాలు ఇస్తాం. రుణమాఫీ ఎప్పుడు వస్తే అప్పుడు రైతు ఖాతాలో జమ చేస్తాం. - డి.సత్యనారాయణరెడ్డి, డీసీసీబీ, ఖమ్మం రూరల్ బ్యాంక్ మేనేజర్