రిజిస్ట్రేషన్ల శాఖకు కాసుల పంట!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్ల శాఖకు ఈ ఏడాది స్థిరాస్తి లావాదేవీలు కాసుల పంట కురిపిస్తున్నాయి. గత మాసం నుంచి పెద్ద నోట్ల రద్దు ప్రభావం కొంత మేరకు పడినప్పటికీ గతేడాదితో పోలిస్తే ఆదాయం బాగానే సమకూరినట్లు కనిపిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో గడిచిన ఎనిమిది నెలల పరిస్థితిని పరిశీలిస్తే,, రాష్ట్రం మొత్తం మీద రూ.2534.01 కోట్లు ఆదాయం రాగా కేవలం గ్రేటర్ పరిధి నుంచే దాదాపు రూ.1828.6 కోట్లు సమకూరింది. అదేవిధంగా మొత్తం 7,53,373 స్థిరాస్తి లావాదేవీలు జరగగా అందులో 2,58,678 దస్తావేజులు గ్రేటర్ పరిధిలోనే నమోదైనట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే రంగారెడ్డి 31.23 శాతం, మేడ్చల్ 38.43 శాతం, హైదాబాద్ (సౌత్) 18.90 శాతం, హైదరాబాద్ 40.08 శాతం ఆదాయం అదనంగా పెరిగినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. వాస్తవంగా గ్రేటర్‌లో గత రెండేళ్ల క్రితం వరకు స్థిరాస్తి రంగంపై నెలకొన్న అనిశ్చితి క్రమంగా తొలగిపోయింది. తాజాగా కొత్త ప్రాజెక్టులు, పరిశ్రమలు. కార్పొరేట్ సంస్థలు. కంపెనీలు. కార్యాలయాలు తరలి రావడం స్థిరాస్తి రంగానికి మరింత కలిసి వచ్చినట్లయింది. తాజాగా నగర శివారులో శంషాబాద్(రంగారెడ్డి), మల్కాజిగిరి (మేడ్చల్) జిల్లా కేంద్రాల ఏర్పాటు కావడంతో ఉప్పల్, మేడిపల్లి, నారపల్లి, ఘట్‌కేసర్, కీసర, నాగారం, షామీర్‌పేట, మేడ్చల్, మహేశ్వరం, ఎల్‌బీనగర్, తదితర ప్రాంతాల్లో భూములు, ఫ్లాట్లకు డిమాండ్ పెరిగింది.
గ్రేటర్‌లో నాలుగు రిజిస్ట్రేషన్ జిల్లాలు.
జిల్లాల పునర్విభజన అనంతరం గ్రేటర్ హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్ల శాఖ నాలుగు జిల్లాలుగా అవతరించింది. హైదరాబాద్ నగరంలోని రెండు రిజిస్ట్రేషన్ సర్కిళ్లు యథాతథంగా ఉండగా, రంగారెడ్డి ఈస్ట్ మేడ్చల్ కొత్తగా రూపుదిద్దుకున్నాయి. వాస్తవానికి గతంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్ల ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకున్న సర్కారు రంగారెడ్డి, రంగారెడ్డి ఈస్ట్ రిజిస్ట్రేషన్ సర్కిళ్లుగా విభజించింది. తాజాగా రంగారెడ్డి రిజిస్ట్రేషన్ సర్కిల్ పరిధిలో రంగారెడ్డి, వికారాబాద్ రెవెన్యూ జిల్లాలను చేర్చింది. ఈస్ట్‌ను మేడ్చల్ జిల్లాగా నామకరణం చేసింది. అదేవిధంగా జిల్లా రిజిస్ట్రేషన్ పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ పరిధులలో కూడా మార్పులు చేర్పులు జరిగాయి. రంగారెడ్డి రిజిస్ట్రేషన్ పరిధిలోని కూకట్‌పల్లి, బాలనగర్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, వల్లభానగర్ సబ్ రిజిస్ట్రార్‌లను మేడ్చల్ రిజిస్ట్రేషన్ జిల్లా పరిధిలోకి చేర్చారు. రంగారెడ్డి ఈస్ట్‌లోని అబుల్లాపూర్‌మెట్, పెద్దఅంబర్‌పేట, హయత్‌నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, సరూర్‌నగర్, చంపాపేట, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం సబ్ రిజిస్ట్రార్లలను రంగారెడ్డి రిజిస్ట్రేషన్ జిల్లా పరిధిలోకి చేర్చారు.