
మరుగుదొడ్లు, ఫామ్‌పాండ్స్ నిర్మించుకోండి
గోపాలపురం : వ్యక్తిగత మరుగుదొడ్లు, రైతులు పంట పొలాల్లో ఫామ్‌పాండ్లు నిర్మిస్తేనే ఆయా గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని కలెక్టర్ కాటంనేని భాస్కర్ అన్నారు.
గోపాలపురం: వ్యక్తిగత మరుగుదొడ్లు, రైతులు పంట పొలాల్లో ఫామ్‌పాండ్లు నిర్మిస్తేనే ఆయా గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని కలెక్టర్ కాటంనేని భాస్కర్ అన్నారు. స్థానిక ఎంపీడీవో సమావేశ మందిరంలో మంగళవారం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరావు అధ్యక్షతన రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ దత్తత గ్రామం సంజీవపురం అభివృద్ధిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ గ్రామంలో అభివృద్ధి పనుల ఛాయలు కనిపించడం లేదన్నారు.
అధికారుల తీరులో మార్పు రావాలని సూచించారు. వ్యక్తిగత మరుగుదొడ్లు నూటికి నూరుశాతం పూర్తయిన పంచాయతీలకు మాత్రమే ఎటువంటి నిధులైనా మంజూరు చేస్తామని, అప్పటి వరకు నిధులు ఇవ్వమని తేల్చి చెప్పారు. ఎంపీ మురళీమోహన్ మాట్లాడుతూ గ్రామస్తులు సమన్వయంతో కలిసి వస్తే అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తామన్నారు. జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ ముళ్లపూడి వెంకట్రావు, జెడ్పీటీసీ సభ్యురాలు ఈలి మోహినీ పద్మజారాణి, దేవరపల్లి జెడ్పీటీసీ కొయ్యలమూడి సుధారాణి తదితరులు పాల్గొన్నారు.