మూలనపడేశారు..
మూలనపడేశారు..
Published Sat, Aug 20 2016 12:55 AM | Last Updated on Mon, Sep 4 2017 9:58 AM
చాలాపాఠశాలల్లో విరిగిపోయిన ‘స్నేహబాల’ ఫర్నీచర్
పట్టించుకోని అధికారులు
విద్యాశాఖాధికారుల ఆదేశాలు పాఠశాలలో అమలుకు నోచుకోవడంలేదు. విద్యార్థులు కోసం ఫర్నీచర్ ఏర్పాటుచేసినా అవి వినియోగంలోలేవు. మూలనపడి విరిగిపోయే స్థితికి చేరుకున్నా క్షేత్రస్థాయిలో అధికారులు మాత్రం వాటి గురించి పట్టించుకోవడంలేదు. పాఠశాల మెయింటెనెన్స్ గ్రాంట్‌ను ఫర్నీచర్ మరమ్మతులకు వినియోగించుకునే అవకాశం ఉన్నా ఉపాధ్యాయులు శ్రద్ధ చూపడంలేదు.
కోట : 2004 సంవత్సరంలో వచ్చిన సునామీ వల్ల తీరప్రాంతం అతలాకుతలమైంది. పాఠశాలల భవనాలు దెబ్బతిన్నాయి. దీంతో తీరప్రాంత మండలాల్లోని పాఠశాలలకు స్నేహబాల కార్యక్రమం ద్వారా ఫర్నిచర్, విద్యాసామగ్రిని అందజేశారు. జర్మనీకి చెందిన యూనిసెఫ్ బందం ఈ కార్యక్రమానికి చేయూతనందించింది. ఈ బందం అన్నీ తీరప్రాంత మండలాల్లోనూ పర్యటించి పాఠశాలల వివరాలు సేకరించి సహాయసహకారాలు అందించింది. కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లోని 210 పాఠశాలల్లో విద్యార్థులు కూర్చుని చదువుకునేందుకు వీలుగా ఫర్నిచర్ ఇచ్చారు. కోట మండలంలో 67 పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం తక్కువుగా ఉన్న నాలుగు పాఠశాలలు మినహా అన్నీ పాఠశాలలకు ఫర్నిచర్‌ను కేటాయించారు. దీనికోసం ఒక్కో పాఠశాలకు రూ.50వేలు వరకు నిధులు వెచ్చించారు.
విరిగిన కుర్చీలే దర్శనం..
ఫర్నీచర్ సమకూరినా వినియోగించకపోవడతో కొద్ది సంవత్సరాలుగా పాఠశాలల్లో విరిగిన కూర్చీలే కనబడుతున్నాయి. అనేక పాఠశాలల్లో ఫర్నిచర్ సామగ్రి దెబ్బతిని, మరమ్మతులకు గురయ్యాయి. వీటి మరమ్మతుల కోసం ప్రత్యేక నిధులు కేటాయించకపోవడంతో ఉపాధ్యాయులు వాటిని మూలనపడేశారు. యూనిసెఫ్ ఫర్నీచర్‌ను వినియోగించాలని ఓసారి ఖచ్చితమైన ఆదేశాలు అందడంతో కొందరు ఉపాధ్యాయులు తమ సొంతనిధులతో మరమ్మతులు జరిపించారు. ఇటీవల మండలంలో పర్యటించిన విద్యాశాఖ మానిటరింగ్ టీం సభ్యులు ఫర్నిచర్ ఉపయోగించని నాలుగు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని నివేదిక పంపారు. దీంతో ఉపాధ్యాయులు వెంటనే అప్రమత్తమయ్యారు. మండలంలో 27 పాఠశాలల్లో ఫర్నీచర్‌ను విద్యార్థుల అవసరాల మేరకు వినియోగిస్తున్నారు. మిగతా పాఠశాలల్లో అవి ఎందుకూ పనికిరాకుండా మూలనపడే ఉన్నాయి.
Advertisement
Advertisement