హామీలు పట్టని సీఎం గల్లా పట్టి లాగండి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని పిలుపు
జహీరాబాద్: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గల్లా పట్టి లాగాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రజలకు పిలుపునిచ్చారు. సీపీఎం నేతల మహాజన పాదయాత్ర గురువారం వికారాబాద్ జిల్లా నుంచి సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం మనియార్‌పల్లికి చేరుకుంది. ఇప్పటి వరకు 800 కిలోమీటర్ల మేర పాదయాత్ర పూర్తి చేశారు. సాయంత్రం కోహీర్‌లోని పాత బస్టాండ్ వద్ద నిర్వహించిన సభలో తమ్మినేని మాట్లాడారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటికై నా అమలు చేయాలని కేసీఆర్‌కు దండం పెట్టి మరో మారు విన్నవించుకోవాలని, అవసరమైతే గల్లా పట్టి కిందకు లాగాలని పిలుపునిచ్చారు. దళితులకు మూడు ఎకరాల భూమి, అందరికీ ఉద్యోగం, ఉపాధి, పేదలకు డబుల్ బెడ్‌రూం, కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య తదితర పథకాల్లో ఒక్కటీ అమలు చేయలేదని విమర్శించారు. ప్రజలకు కావాల్సింది వారి బతుకులను మార్చే అభివృద్ధి మాత్రమే అన్నారు.