చిన్న జిల్లాలతో ప్రయోజనమేదీ?
సిబ్బంది కొరతతో కదలని ఫైళ్లు: తమ్మినేని
జహీరాబాద్: చిన్న జిల్లాలు ఏర్పడినా ఉపయోగం లేకుండా పోరుుందని సీపీఎం రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. సిబ్బంది కొరత కారణంగా ఫైళ్లు ముందుకు కదలడం లేదని, ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో నిర్వహించిన మహాజన పాదయాత్ర సందర్భంగా ఆయన మాట్లాడారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో అవసరమైన పోస్టులను సత్వరం భర్తీ చేసి ప్రజలకు మెరుగైన సేవలందించాలని కోరారు. ముస్లిం మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్.. ఇచ్చిన హామీలను మర్చిపోయారన్నారు. కేసీఆర్ ఏకపక్ష వైఖరి కారణంగా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బంగారు తెలంగాణ ఎలా సాధ్యమో ఆయనకే తెలియాలన్నారు.