బీసీలకూ సబ్‌ప్లాన్ ప్రకటించాలి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని డిమాండ్
సాక్షి, కామారెడ్డి: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను అమలు చేయడానికి పకడ్బందీ నిబంధనలు రూపొందించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం కోసం సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు కామారెడ్డి, సదాశివనగర్, రామారెడ్డి మండలాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ వచ్చినప్పటికీ అమలులో వైఫల్యం వల్ల నిధులు దారి మళ్లుతున్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికే ఉపయోగించాలన్నారు. బీసీల కోసం కూడా సబ్‌ప్లాన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
జనాభాలో 93 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సామాజికంగా, ఆర్థికంగా సమానత్వం కోసం సీపీఎం పోరాడుతోందని పేర్కొన్నారు. అందుకోసమే పాదయాత్ర చేస్తున్నామన్నారు. పాదయాత్ర తెలంగాణలోని 31 జిల్లాల్లో సుమారు 4 వేల కిలోమీటర్లు సాగుతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేసీఆర్ విస్మరించి, ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న హామీ నీటిమూట అరుు్యందన్నారు. బీడీ కార్మికులకు జీవనభృతి ఇస్తామని చెప్పి ఇళ్లలో కయ్యం బెట్టారని విమర్శించారు. కేసీఆర్ ఇంట్లో మాత్రం అందరికీ పదవులు కావాలెగాని పేద బీడీకార్మికులకు మాత్రం ఇంట్లో ఒక్కరికే జీవనభృతి ఇవ్వడం ఎంతవరకు న్యాయమో చెప్పాలన్నారు. ఆయన వెంట సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సిద్ధిరాములు తదితరులున్నారు.