దేవుడి పేరుతో దందా !
పండగొస్తే అందరూ సంబరం చేసుకుంటారు. కానీ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని వ్యాపారులు మాత్రం వణికిపోతున్నారు.
సంగీత కళాశాలలో వేదికల ఏర్పాటు
టార్గెట్ నిర్ణయించి వసూలు
ప్రజాప్రతినిధి తీరుపై విమర్శల వెల్లువ
సాక్షి, విజయవాడ :
పండగొస్తే అందరూ సంబరం చేసుకుంటారు. కానీ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని వ్యాపారులు మాత్రం వణికిపోతున్నారు. పండగ పేరు చెప్పగానే ఆందోళనకు గురవుతున్నారు. ఈ నియోజకవర్గంలోని ముఖ్య ప్రజాప్రతినిధి అనుచరులు ఉత్సవాలు, పండగల పేరుతో అడ్డగోలుగా వ్యాపారుల నుంచి వసూళ్లకు పాల్పడటమే ఇందుకు కారణం. సంగీత కళాశాలను వేదికగా చేసుకుని దేవుడి పేరుతో టార్గెట్లు విధించి మరీ దందా సాగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రెండేళ్లుగా దసరా ఉత్సవాల పేరుతో...
నగరంలో ఇంద్రకీలాద్రిపై ప్రతి ఏడాది దసరా ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. నగరంలో అనేక దేవాలయాల్లోనూ అమ్మవారి విగ్రహాలు పెట్టి ఉత్సవాలు చేస్తారు. అయితే స్థానిక ప్రజాప్రతినిధి ఆధ్వర్యాన రెండేళ్లుగా ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత, నృత్య కళాశాలలో దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఏ దేవాలయం లేకపోయినా తాత్కాలికంగా అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేసి ఉత్సవాలు నిర్వహించడం విశేషం. ఈ ఉత్సవాల పేరుతో నియోజకవర్గంలోని వ్యాపారుల నుంచి భారీగా డబ్బు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తొలి ఏడాది ఈ ఉత్సవాలకు సీఎం హాజరుకావాల్సి ఉన్నా... నిర్వాహకులపై తీవ్ర విమర్శలు రావడంతో చివరి నిమిషంలో ఆయన రాలేదు. మరోవైపు భాషా, సంస్కృతిక శాఖ నుంచి రూ.30 లక్షలు తీసుకుని ఇక్కడ తూతూ మంత్రంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆ నిధులను నొక్కేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
గణేష్ ఉత్సవాలనూ కబ్జా !
నగర ప్రతిష్ట పెంచేందుకు గత ఏడాది కొంతమంది ఔత్సాహిక వ్యాపారులు డూండి గణేష్ సేవా సమితి పేరుతో ఒక సంస్థను ప్రారంభించారు. ఆ సంస్థ ఆధ్వర్యాన సంగీత కళాశాలలో 73 అడుగుల వినాయక మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలు పెద్ద ఎత్తున ఈ విగ్రహాన్ని దర్శించుకుని పూజలు చేశారు. అయితే ఆ సమయంలో డూండి గణేష్ సేవా సమితి వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు రూ.30 లక్షలు స్వాహా చేసినట్లు మిగిలిన సభ్యుల బహిరంగంగానే ఆరోపించారు. అయితే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సభ్యుడిని కలుపుకొని ఈ ఏడాది స్థానిక ప్రజాప్రతినిధి డూండి గణేష్ సేవా సమితికి కొత్త కమిటీని ఏర్పాటుచేశారు. దీనిపై ప్రశ్నించిన పాత కమిటీలో ఉన్న పారిశ్రామికవేత్త కోగంటి సత్యంను పథకం ప్రకారం అరెస్ట్ చేయించారు. తద్వారా ఆయన వర్గాన్ని భయభ్రాంతులకు గురిచేసి, ఉత్సవాల వైపు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. గణేష్ ఉత్సవాల పేరుతో కూడా నియోజవకర్గంలోని వ్యాపారుల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. సులభంగా లక్షలాది రూపాయలు వస్తుండటంతో ఇటువంటి ఉత్సవాలు మరిన్ని నిర్వహించాలని సదరు ప్రజాప్రతినిధి వర్గం పథకాలు రచిస్తున్నట్లు తెలి సింది. గత ఏడాది గణేష్ ఉత్సవాల సమయంలో సంగీత కళాశాల వద్ద ఆ ప్రజాప్రతినిధి పేరుతో ఫ్లెక్సీలు, బ్యానర్ల ఏర్పాటుపై దుమారం రేగడంతో వెనక్కి తగ్గారు. ఈసారి పెద్ద ఎత్తున రాజకీయ నేతల ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సత్యనారాయణపురం శివాజీ కేఫ్ సమీపంలోని సీతారామ కల్యాణ మండపంపైనా సదరు ప్రజాప్రతినిధి కన్నేశారు. పథకం ప్రకారం దేవాదాయ శాఖను ఉపయోగించి ఈ కల్యాణ మండపాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే బ్రాహ్మణ సంఘాలతోపాటు టీడీపీ మినహా అన్ని రాజకీయ పార్టీల నుంచి తీవ్ర విమర్శలు రావడం.. చివరకు ఈ విషయం సీఎం వరకు వెళ్లడం,ఆయన సీరియస్ కావడంతో వెనక్కి తగ్గారు. ప్రస్తుతం ఈ వివాదం దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు వద్ద పెండింగ్‌లో ఉంది. ఇలా ప్రతి సందర్భంలోనూ వ్యాపారులను, కొన్ని వర్గాలను ఇబ్బంది పెడుతూ ఉత్సవాలు నిర్వహించడం వల్ల సదరు ప్రజాప్రతినిధితోపాటు టీడీపీకి కూడా అప్రతిష్ట వస్తోందని సొంత పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు.