గ్రేటర్‌కు కొత్త రూపు!
సాక్షి, సిటీబ్యూరో: జూబ్లీహిల్స్.. నాగోల్.. మూసాపేట.. బేగంపేట.. మలక్‌పేట.. వనస్థలిపురం/హయత్‌నగర్.... ఇవన్నీ ఏమిటనుకుంటున్నారా ! కొత్తగా రానున్న జీహెచ్‌ఎంసీ సర్కిళ్ల పేర్లు !గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో సర్కిళ్ల సంఖ్యను పెంచాలని నిర్ణయించారు. ప్రస్తుతం 24 సర్కిళ్లు ఉండగా...6 కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. ఇవి దసరా నుంచి అమలులోకి వస్తాయి. కాగా గ్రేటర్ పరిధిలో గతంలో 18 సర్కిళ్లుగా ఉండగా, వాటిని 24 సర్కిళ్లుగా మార్చారు.
ఆరు సర్కిళ్లను రెండు సర్కిళ్లుగా విభజించి వీటిని పెంచారు. అప్పటినుంచే సంబంధిత సర్కిల్‌నే ఏ, బీలుగా వ్యవహరిస్తున్నారు. ఉదాహరణకు ఖైరతాబాద్ సర్కిల్‌ను రెండుగా విభజించాక ఖైరతాబాద్–ఎ, ఖైరతాబాద్–బి సర్కిల్‌గా వ్యవహరిస్తున్నారు. దీంతో గందరగోళం ఏర్పడింది. ప్రజలకు తమది ఏ సర్కిలో తెలియక అయోమమానికి గురవుతున్నారు. మరికొన్ని సర్కిళ్లు కేవలం సర్కిల్ నెంబర్లతోనే కొనసాగుతున్నాయి. వీటిని కూడా మారుస్తూ అన్ని సర్కిళ్లకు పేర్లు పెట్టనున్నారు. దాంతోపాటు ఇప్పుడున్న 24 సర్కిళ్లకు అదనంగా మరో 6 సర్కిళ్లు పెంచి మొత్తం 30 సర్కిళ్లు రానున్నాయి. 30 సర్కిళ్లకు వేర్వేరు పేర్లు రానున్నాయి.
ఇప్పుడున్న సర్కిళ్ల పేర్లను అలాగే ఉంచి పేరు లేకుండా నెంబర్ల పేర్లతో, ఏ లేదా బీ పేర్లతోకొనసాగుతున్న సర్కిళ్లకు నియోజకవర్గ పేరును లేదా, సంబంధిత సర్కిల్‌లో బాగా ప్రాచుర్యం కలిగిన డివిజన్ పేరునే సర్కిల్ పేరుగా నిర్ణయించనున్నారు. ఈ లెక్కన పైన పేర్కొన్న పేర్లతో కొత్త సర్కిళ్లు ఏర్పాటు కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వీటితోపాటు మరికొన్ని సర్కిళ్లు కొత్తగా వాడుకలోకి రానున్నాయి. ప్రసాదరావు కమిటీ సిపార్సుల మేరకు జీహెచ్‌ఎంసీని 30 సర్కిళ్లుగా విభజించే ప్రక్రియను జీహెచ్‌ఎంసీ ఇప్పటికే చేపట్టింది. కొత్త సర్కిళ్ల ముసాయిదాల్లో అవసరమైన మార్పుచేర్పుల కోసం జోనల్ కమిషనర్లకు పంపించారు.
సౌత్‌జోన్ నుంచి మాత్రం మార్పుచేర్పులు సూచించినట్లు తెలిసింది. సెంట్రల్‌జోన్ నుంచి ఇంకా నివేదిక అందలేదు. అవి రాగానే జీహెచ్‌ఎంసీ జనరల్‌బాడీ సమావేశం ముందుంచి కొత్త సర్కిళ్లను వాడుకలోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నెల 30న వార్డుకమిటీ సభ్యుల కోసం జరిగే ప్రత్యేక సర్వసభ్య సమావేశానంతరం జరిగే సాధారణ సర్వసభ్య సమావేశం ముందు ఆమోదం కోసం కొత్త సర్కిళ్లను ఉంచుతారు. ఎటొచ్చీ.. దసరానాటికి కొత్త సర్కిళ్లు వాడుకలోకి రానున్నాయని సంబంధిత అధికారి తెలిపారు.
దసరా నాటికి కొత్త జిల్లాలు కూడా రానున్నందున ఆలోగానే తమ సర్కిళ్ల కసరత్తు కూడా పూర్తిచేయాలని జీహెచ్‌ఎంసీ యోచిస్తోంది. గ్రేటర్‌లో పరిపాలన సౌలభ్యం కోసం రేషనలైజేషన్, స్టాఫింగ్ ప్యాటర్న్‌పై తగు సూచనలందజేయాల్సిందిగా ప్రభుత్వం రిటైర్డు ఐఏఎస్ అధికారి ప్రసాదరావు నేతృత్వంలో కమిటీని నియమించింది. అన్ని అంశాలు కూలంకషంగా పరిశీలించిన ప్రసాదరావు కమిటీ సర్కిళ్లను 30కి పెంచాలని సిఫార్సు చే శారు.
అదనపు సర్కిళ్లు..
ఎల్‌బీనగర్‌లో సర్కిల్ 3ఎ, 3బిలకు తోడు మరో సర్కిల్, సర్కిల్ 4 ఎ, బిలకు తోడు చార్మినార్‌లో మరో సర్కిల్, 10ఎ, బిలకు తోడు ఖైరతాబాద్‌లో మరో సర్కిల్ అదనంగా రానున్నాయి. వీటితోపాటు సికింద్రాబాద్, కుత్బుల్లాపూర్, సర్కిల్–5(చార్మినార్–2లో) ఒక్కో సర్కిల్ అదనంగా వచ్చే అవకాశం ఉంది.