ఉత్తమ భోదన అందించాలి
జెడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డి
శంకర్‌పల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు గుణాత్మకమైన విద్యను భోదించాలని జెడ్పీ చైర్‌పర్సన్ సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని కొండకల్ జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో రాజీవ్ విద్యా మిషన్ ద్వారా నిర్మించి అదనపు గదులను ఆదివారం ప్రారంభించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల పనితీరు చాలావరకు మార్చుకోవాలని గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభోదన బాగుందని పట్టణ ప్రాంతానికి దగ్గరలో బోధన సరిగా లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని నిరుటికంటే ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో చాలామంది చేరారన్నారు. ప్రతి పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం బోధన జరుగుతుందని, ప్రైవేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధన అందించాలని ఆమె సూచించారు. అనంతరం పాఠశాలలో నెలకొన్న సమస్యలను ప్రధానోపాధ్యాయుడు విద్యాకర్ చైర్‌పర్సన్ దృష్టికి తీసుకొచ్చారు. పాఠశాలలో తాగునీటి సమస్య ఉందని కొత్తబోరు వేయించి మోటర్ బిగించాలని, పాఠశాలలో 11 కంప్యూటర్లు ఉన్నా శిక్షకుడిని నియమించాలని, వంట గదికి నిధులు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ నర్సింలు, సర్పంచ్ యాదమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు జ్యోతి, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్‌చైర్మన్ ఒగ్గుమల్లేష్ యాదవ్, దండు రాజేశ్వర్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు విఠలయ్య, టీఆర్‌ఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి వెంకట్‌రెడ్డి, వాసుదేవ్ కన్నా, విద్యాకమిటీ చైర్మన్ రాజు, నాయకులు గోవింద్‌రెడ్డి, అయిలయ్య, శేరి అనంత్‌రెడ్డి డి.గోవర్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.