భద్రాచలం(ఖమ్మం జిల్లా): ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నదిలో నీటిమట్టం శరవేగంగా పెరుగుతోంది. మంగళవారం ఉదయం 51.04 అడుగులకు నీటి మట్టం చేరింది. 53 అడుగులకు నీటిమట్టం చేరితే అధికారులు 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. భారీ వర్షాలవల్ల రహదారులపై నీళ్లు చేరడంతో భద్రాచలం- వెంకటాపురం, భద్రాచలం- దుమ్ముగూడెం మధ్య రాకపోకలు తెగిపోయాయి.
అలాగే వాజేడు, చర్ల, వెంకటాపురం, తురుబాక, రేగుపల్లి తదితర గ్రామాల్లో రోడ్లు నీట మునగటమేకాక, గ్రామాలను సైతం నీళ్లు చుట్టుముట్టాయి. లెక్కలేనన్ని గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. ఇప్పటికే అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
తల్పేరుకు పోటెత్తిన వరద.. 13 గేట్లు ఎత్తివేత
చర్ల: ఖమ్మం జిల్లా చర్ల మండలంలో ఉన్న తల్పేరుకు వదర పోటెత్తింది. ఫలితంగా మంగళవారం ఉదయం 13 గేట్లు ఎత్తివేశారు. ఇరిగేషన్ అధికారులు 14,500 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలివేశారు. భారీ వర్షాలు కురుస్తున్నందువల్ల పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాకపోకలు బంద్ కావడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తల్పేరుకు వస్తున్న ఇన్‌ఫ్లోను జాగ్రత్తగా గమనిస్తున్నారు.