
అర్ధరాత్రి పోలీస్ వేట
♦ సినీ ఫక్కీలో దోపిడీ దొంగలను వెంటాడిన పోలీసులు
♦ మూడు చోట్ల తప్పించుకున్న దుండగులు
♦ ఇంటిదొంగల సహకారంతోనే విజయవాడలో భారీ దోపిడీ?
♦ విచారణను వేగవంతం చేసిన పోలీసులు
సాక్షి, అమరావతి బ్యూరో/గుంటూరు: విజయవాడలో తుపాకులు, కత్తులతో బెదిరించి 7 కిలోల బంగారం దోచుకెళ్లిన దుండగుల కోసం పోలీసులు మంగళవారం అర్ధరాత్రి వేట సాగించారు. సినీ ఫక్కీలో దోపిడీ దొంగలను వెంటాడారు. దుండగులు విజయవాడ నుంచి గుంటూరు వైపునకు వస్తున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గుంటూరు అర్బన్ ఎస్పీ విజయారావు నేతృత్వంలో గుంటూరు నగర శివారు ప్రాంతాలు, హైవేలపై భారీగా మోహరించి వాహనాలను తనిఖీ చేశారు. ఎంహెచ్03 బీసీ 9810 నంబర్ గల వాహనంలో దొంగలు ఉన్నట్లు గుర్తించి, పాత గుంటూరు పోలీసు స్టేషన్ పరిధిలోని కింగ్ హోటల్ వద్ద అడ్డుకునే ప్రయత్నం చేశారు.
అయితే, వాహనాన్ని వేగంగా నడుపుతూ దుండగులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. నగరంపాలెం పోలీసు స్టేషన్ పరిధిలోని చుట్టుగుంట వద్ద మరోసారి పోలీసుల నుంచి తప్పించుకున్న దుండగులు వాహనాన్ని హైవే వైపు మళ్లించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు చిలకలూరిపేట వై–జంక్షన్ వద్ద హైవేను పూర్తిగా మూసివేసి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడ వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో దుండగులు ప్రయాణిస్తున్న వాహనం ఆ ప్రాంతానికి వచ్చి ఆగింది. పోలీసులు తనిఖీలు చేస్తున్న విషయం గమనించిన దుండగులు వాహనాన్ని అక్కడే నిలిపివేసి పక్కనే ఉన్న పొలాల్లోకి పరారయ్యారు. సుమారు 8 మంది తుపాకులు చేతబూని పరారైనట్లు పోలీసులు గుర్తించారు.
రెండు తుపాకులు, బుల్లెట్లు స్వాధీనం
దొంగలు వదిలేసిన వాహనం, అందులో ఉన్న ఓ తుపాకి, 2 బుల్లెట్లు, ఓ సెల్‌ఫోన్, కొన్ని బట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కనే ఉన్న కాలువలో మరో తుపాకి దొరికింది. గుంటూరు రూరల్ మండలం ఓబులనాయుడుపాలెం సమీపంలో అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతున్నారనే సమాచారంతో ఆ ప్రాంతంలో పోలీసులు జల్లెడ పట్టారు.
ఇంటి దొంగల సహకారం?
కార్ఖానాలో భారీ దోపిడీ వెనుక విస్మయకర అంశాలు వెలుగుచూస్తున్నాయి. ఇంటిదొంగల సహకారంతోనే దొంగల ముఠా దోపిడీకి పాల్పడిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
అంతా పశ్చిమ బెంగాల్ వారే: విజయవాడలోని గోపాల్‌రెడ్డి రోడ్డులో ఓ ఇరుకు సందులో మొదటి అంతస్తులో బంగారు నగల కార్ఖానా ఉంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన సోదరులు శంకర్ మున్నా, సుభాష్ మున్నా ఆ కార్ఖానా యజమానులు. అందులోని సిబ్బంది దాదాపు అంతా పశ్చిమ బెంగాల్‌కు చెందినవారే. ఆ కార్ఖానాలో మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో దొంగల ముఠా ఆయుధాలతో సహా ప్రవేశించి బీభత్సం సృష్టించి, 7 కిలోల బంగారం, రూ. 2.50 లక్షల దోపిడీకి పాల్పడింది. ఆ కార్ఖానాలో ఆ సమయంలో పనిచేస్తూ ఉంటుందని, అందులోనూ అంతటి బంగారం ఉంటుందన్న సమాచారం అంతర్రాష్ట్ర దొంగలకు ఎలా తెలిసిందనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. కార్ఖానాలోని సీసీ కెమెరాలు రెండు నెలలుగా పనిచేయడం లేదు.
పోలీసుల అదుపులో ముగ్గురు
దోపిడీ సమాచారం తెలియగానే పోలీసులు రంగంలోకి దిగారు. క్లూస్ టీంలు బుధవారం సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించాయి. పోలీసులు ఆ కార్ఖానాకు ఎదురుగా ఉన్న ఓ దుకాణంలోని సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించగా, 10 మంది దొంగలు వేగంగా పరిగెత్తుతున్నట్లు అందులో ఉంది. కానీ, వాన వల్ల అందులో దొంగల ముఖాలు స్పష్టంగా కనిపించలేదు. ముగ్గురు అనుమానితులను పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
8 బృందాలతో గాలింపు: దోపిడీ ముఠాను పట్టుకునేందుకు 8 ప్రత్యేక పోలీసు బృందాలను నియమించారు. విజయవాడ, గుంటూరు జిల్లాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. దొంగలంతా ఉత్తరప్రదేశ్, బిహార్‌లకు చెందినవారని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు ఇటీవల విశాఖ, కర్నూలులో జరిగిన దొంగతనాలకు, ఈ దోపిడీ దొంగలకు సంబంధం ఉందా? అనే కోణంలో విచారిస్తున్నారు.
రాజధానిలో భద్రతపై ఉదాసీనత
రాష్ట్ర రాజధానిలో భద్రతపై ప్రభుత్వం, పోలీసుల ఉదాసీన వైఖరే దోపిడీ ముఠాకు కలిసి వచ్చింది. దాదాపు 200 మంది దొంగలు రాష్ట్ర రాజధానిలో తిష్టవేశారని నిఘా వర్గాలు ఇటీవలే హెచ్చరించాయి. అయినా ప్రభుత్వం గానీ, పోలీసులు గానీ ముఠాల ఆటకట్టించడంపై దృష్టి సారించలేదు. కాగా, దోపిడీ కేసును త్వరలోనే ఛేదిస్తామని విజయవాడ పోలీస్ కమిషర్ గౌతం సవాంగ్ బుధవారం చెప్పారు.