ట్రాన్స్‌ఫార్మర్ల కొను‘గోల్‌మాల్‌’ | golmal in transfarmers | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌ఫార్మర్ల కొను‘గోల్‌మాల్‌’

Published Tue, Jul 26 2016 8:03 PM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM

సిరిసిల్ల ‘సెస్‌’ ఆఫీస్‌

సిరిసిల్ల ‘సెస్‌’ ఆఫీస్‌

  • టెండర్లు లేకుండా కొనుగోలు
  • పాత సంస్థకే మళ్లీ ఆర్డర్‌ ఇచ్చిన సెస్‌
  • మెజారిటీ డైరెక్టర్లు వద్దన్నా అటువైపే మొగ్గు 
  • రూ.92.50 లక్షలతో 70 ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోలు 
  • సిరిసిల్ల : సిరిసిల్ల సహకార విద్యుత్‌ సరఫరా సంఘం(సెస్‌)లో ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోలు వివాదాస్పదమైంది. పర్చేస్‌ కమిటీ టెండర్లు పిలువకుండానే 70 ట్రాన్స్‌ఫార్మర్లను రూ.92.50 లక్షలతో కొనుగోలు చేయడానికి ఆర్డర్‌ ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం టెండర్లు పిలువాల్సి ఉండగా.. అదేం లేకుండా పాత కంపెనీకే కొత్త ఆర్డర్లు ఇచ్చినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ‘సెస్‌’లోని కీలక వ్యక్తులు కమీషన్లు(ముడుపులు) పొందారనే ఆరోపణలున్నాయి. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోలుపై సెస్‌ పాలకవర్గంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
    మెజారిటీ డైరెక్టర్లు వద్దన్నా..
    కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోలుపై మెజారిటీ డైరెక్టర్లు ఇటీవల సమావేశమై టెండర్లు పిలువాలని.. పాత సంస్థకు ఇచ్చే ఆర్డర్లను రద్దు చేయాలని సెస్‌ చైర్మన్‌ దోర్నాల లక్ష్మారెడ్డికి లేఖ అందించారు. దీనిపై పాలకవర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చైర్మన్‌ హామీ ఇచ్చారు. కానీ మళ్లీ పాత సంస్థకే ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోలు ఆర్డర్‌ ఇవ్వడంపై డైరెక్టర్లే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌లో ఐరన్, కాపర్, ఇతర సామగ్రి ధరలు తగ్గిన నేపథ్యంలో పాత ధరలకే ట్రాన్స్‌ఫార్మర్లు కొనుగోలు చేయడంపై డైరెక్టర్లు అభ్యంతరం తెలిపారు. 100 కేవీ  ట్రాన్స్‌ఫార్మర్‌ ధర రూ.1.60 లక్షలు ఉండగా, 60 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ ధర రూ.95 వేలు ఉంది. ఇంత కన్నా తక్కువ ధరకు ఇతర కంపెనీలు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నా.. పాత కంపెనీకే ఆర్డర్‌ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. సదరు కంపెనీతో చేసుకున్న కమీషన్ల ఒప్పందం మేరకే మళ్లీ ఆర్డర్‌ ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి.  
    పునరావాస కాలనీలకు..
    మధ్యమానేరు జలాశయంలో ముంపునకు గురవుతున్న గ్రామాలకు ప్రభుత్వం కొదురుపాక, నాంపల్లి, తిప్పాపూర్, చంద్రగిరి గ్రామాల్లో పునరావాస కాలనీలు నిర్మిస్తోంది. ఈ కాలనీల్లో విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని కోరుతూ కలెక్టర్‌ నీతూప్రసాద్‌ సెస్‌ సంస్థకు డబ్బులు డిపాజిట్‌ చేసింది. వీటితో సెస్‌ ట్రాన్స్‌పార్మర్లు కొనుగోలు చేస్తుంది. 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లను 40, 60 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లు 30 కొనుగోలు చేసేందుకు పాత కంపెనీకే ఆర్డర్లు ఇచ్చారు. పాత కంపెనీ ప్రతినిధులతో సెస్‌లోని కీలక వ్యక్తులకు సత్సంబంధాలు ఉండడంతో మళ్లీ ఆ కంపెనీకే ఆర్డర్లు ఇచ్చారనే వాదన ఉంది. సెస్‌ బాస్‌ మెతక వైఖరితో అన్నింటికీ తలూపడం, నిబంధనల విషయంలో ముక్కు సూటిగా వ్యవహరించకపోవడంతో కొను‘గోల్‌మాల్‌’కు అవకాశంగా మారిందని పాలకవర్గ సభ్యుడొకరు చెప్పారు. 
     
    తప్పుడు ఆరోపణలు..
    దోర్నాల లక్ష్మారెడ్డి, సెస్‌ చైర్మన్‌
    పునరావాస కాలనీలో విద్యుత్‌ సౌకర్యం యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయాలి. ఈ ఏడాదే 3 టీఎంసీల నీటిని మధ్యమానేరులో నిల్వ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఊరు మునిగిపోతే జనం పునరావాస కాలనీకి వస్తారు. అక్కడ కరెంట్‌ లేక పోతే సెస్‌ను నిందిస్తారు. టెండర్‌ ప్రాసెస్‌ పూర్తి కావడానికి 45రోజులు పడుతుంది. అందుకే పాత కంపెనీకే ఆర్డర్లు ఇచ్చాం. అవసరాన్ని బట్టి రిపీట్‌ ఆర్డర్లు ఇవ్వొచ్చు. పాలకవర్గ సభ్యులకు ఈ విషయంలో స్పష్టత ఇచ్చాను. సమావేశానికి రానివారు, సంస్థను పాలకవర్గాన్ని బద్‌నాం చేయాలని చూస్తున్నారు. వారివన్నీ తప్పుడు ఆరోపణలు. సంస్థ రూల్స్‌పై నాకు పూర్తి అవగాహన ఉంది. వ్యవసాయ సీజన్‌ మొదలైంది. ‘సెస్‌’కు  ట్రాన్స్‌ఫార్మర్లు వెంటనే అవసరం ఉన్నాయి. అందుకే కొనుగోలుకు ఆర్డర్‌  ఇచ్చాం. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement