చేమతో అన్నదాతలకు సిరులు
పెరిగిన దిగుబడి
ఆదాయం రావడంతో ఆనందంలో రైతులు
సంగం : చేమగడ్డలు సాగుచేస్తున్న రైతులు లాభాలబాట పట్టారు. మండలంలోని అనసూయనగర్, దువ్వూరు, అరవపాళెం గ్రామాల్లో వందల ఎకరాల్లో చేమ సాగులో ఉంది. ప్రస్తుతం కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. దిగుబడి బాగా వస్తుండటంతో రైతులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎకరా చేమ సాగుకు సుమారు రూ.75 వేలు అవుతోంది. ఇందులో రూ.20 వేలు కౌలుకు ఇస్తుండగా, రూ.50 వేలు కూలీలు, తల్లిగడ్డలు, రవాణా చార్జీలు తదితరవాటి కోసం ఖర్చవుతోంది.
100 బస్తాల దిగుబడి
వాతావరణం అనుకూలించడంతో ఎకరానికి నూరు 73 కేజీల బస్తాలు దిగుబడి వస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో బస్తా ధర రూ.1,300 పలుకుతోంది. దీంతో ఖర్చులుపోను ఎకరానికి రూ.55 వేల ఆదాయం వస్తోంది. పంట కాలం ఆరు నెలలు అయినా రూ.55 వేలు ఆదాయం రావడం తమకు ధైర్యానిచ్చిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సంవత్సరం పొడుగుతూ రెండుకార్లు చేమపంటే వేయాలని కొందరు రైతులు నిర్ణయించుకున్నారు. ఇప్పటికే కోతలు పూర్తయిన రైతులు తిరిగిన పంట వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ సీజన్‌లో పనికి వచ్చే తల్లిగడ్డ కోసం నెల్లూరు వైపు పరుగులు తీస్తున్నారు. నిత్యం తెగుళ్లు, సాగునీటి సమస్యలతో వరిసాగు చేస్తున్న అన్నదాతలు సైతం చేమపంట వైపు దష్టి సారిస్తున్నారు. వరి పంట ఆదాయాలు తగ్గడంతో పాటు నష్టాలు వస్తుండటంతో ప్రత్యామ్నాయ పంటలపై మండల రైతాంగం అధికంగా దష్టిపెట్టింది.