వీవీఐటీలో ‘గూగుల్ డెవలపర్స్ కోడ్ ల్యాబ్’
వీవీఐటీలో ‘గూగుల్ డెవలపర్స్ కోడ్ ల్యాబ్’
Published Sat, Sep 24 2016 6:53 PM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM
పెదకాకాని: నంబూరు వాసిరెడ్డి వెంకటాద్రి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లోని ఏపీఎస్‌ఎస్‌డీసీ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్(సిఓఇ)లో అంతర్జాతీయ దిగ్గజ సంస్థ గూగుల్ భారతదేశంలో తన మొట్టమొదటి గూగుల్ డెవలపర్స్ కోడ్ ల్యాబ్‌ను ప్రారంభించనుందని వి.వి.ఐ.టి చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ తెలిపారు. గూగుల్‌కు చెందిన నిపుణులు కళాశాలకు శుక్రవారం విచ్చేసి ల్యాబ్ ప్రారంభానికి కళాశాలలో ఉన్న సదుపాయాలను పరిశీలించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా గూగుల్ మౌంటెన్‌వ్యూ, అమెరికాకు చెందిన క్లేర్ బేలే మాట్లాడుతూ ఎపిఎస్‌ఎస్‌డీసీ, వీవీఐటీ కళాశాలలతో సంయుక్తంగా గూగుల్ డెవలపర్స్ కోడ్ ల్యాబ్ ను ప్రారంభించనున్నామని తెలిపారు. పరిశోధన, అభివృద్ధిలో ఈ ల్యాబ్ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. గూగుల్ భారతదేశ యువతలో మంచి నైపుణ్యం ఉందనే ఉద్దేశ్యంతోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఇన్నోవేషన్ ల్యాబరేటరీలను ప్రారంభిస్తుందన్నారు. వివిఐటి చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ మాట్లాడుతూ గూగుల్, ఏపీఎస్‌ఎస్‌డీసీతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను నిర్వహించటం తమకు ఎంతో గర్వకారణమన్నారు. ఈ సమావేశంలో గూగుల్ నిపుణుల బృందంలోని క్లేర్ బేలే, జేమ్స్ బాగ్‌మాన్ లతో పాటు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు, ప్రిన్సిపల్ డాక్టర్ వై.మల్లికార్జునరెడ్డి చర్చించారు.
Advertisement
Advertisement