కాంట్రాక్టర్లు, యాజమాన్యాలతో కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల శ్రమను దోచుకుంటోందని సీఐటీయూ విమర్శించింది.
కనీస వేతనాన్ని రూ.18వేలు చేస్తూ చట్టాన్ని తేవాలి: సీఐటీయూ
సాక్షి, అమరావతి: కాంట్రాక్టర్లు, యాజమాన్యాలతో కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల శ్రమను దోచుకుంటోందని సీఐటీయూ విమర్శించింది. కార్మికులకు కనీస వేతనంగా నెలకు రూ.18వేలు ఇచ్చేలా తక్షణమే చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ 14వ రాష్ట్ర మహాసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. విజయవాడలో నాలుగు రోజులుగా జరుగుతున్న సీఐటీయూ 14వ రాష్ట్ర మహాసభలు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా రెండేళ్ల కాలానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అలాగే కార్మికుల సమస్యలపై ప్రవేశపెట్టిన 28 తీర్మానాలకు మహాసభ ఆమోదం తెలిపింది.
అనంతరం సీఐటీయూ రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్ మీడియాతో మాట్లాడుతూ.. కనీస వేతన చట్టాన్ని అమలు చేయకపోవడంతో కార్మికులు ప్రతి నెలా రూ.వేల కోట్లు నష్టపోతున్నారని మండిపడ్డారు. కనీస వేతన అమలుపై జూలై నెలాఖరున కలెక్టరేట్లను దిగ్భంధించనున్నట్లు తెలిపారు. సీఐటీయూ రాష్ట్ర నూతన అధ్యక్షుడు సి.హెచ్ నర్సింగరావు మాట్లాడుతూ..కనీస వేతన సలహా సంఘాన్ని ఏర్పాటుకు డిమాండ్ చేశారు.