ఆయుష్‌ను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం
ఆయుష్ విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం క్రమంగా నిర్వీర్యం చేస్తోందని ఏపీ ఆయుష్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ జగనమోహన్‌మూర్తి, డాక్టర్ ఎస్. కేదార్‌నాథ్ విమర్శించారు.
కర్నూలు(హాస్పిటల్): ఆయుష్ విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం క్రమంగా నిర్వీర్యం చేస్తోందని ఏపీ ఆయుష్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ జగనమోహన్‌మూర్తి, డాక్టర్ ఎస్. కేదార్‌నాథ్ విమర్శించారు. ఏపీ ఆయుష్ వైద్యుల సమావేశం ఆదివారం నగరంలోని డాక్టర్ అబ్దుల్ హక్ యునాని మెడికల్ కాలేజిలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2008 నుంచి రాష్ట్రంలో ఆయుష్ విభాగంలో ఖాళీలను భర్తీ చేయలేదన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆయుష్ వైద్య విధానం నిర్లక్ష్యానికి గురయ్యిందన్నారు. కొత్తగా ఏర్పాటైన అవశేష ఆంధ్రప్రదేశ్‌కు 587 వైద్యశాలలు కేటాయించగా, అందులో వైద్యాధికారుల నియామకం జరగలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం 2014లో నేషనల్ ఆయుష్ మిషన్‌లో ఆయుష్‌కు ప్రత్యేక మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారన్నారు. కానీ మన రాష్ట్రంలో అందులో భాగంగా వైద్యాధికారుల నియామకం చేయలేదన్నారు. ఇందులో భాగమైన ఎన్‌ఆర్‌హెచ్‌ఎంలో ఆయుష్ వైద్యుల నియామకం సగభాగం మాత్రమేనని, వీరికి కూడా వేతనాలను 8 నెలలుగా చెల్లించడం లేదన్నారు. దాదాపు 1000కి పైగా వైద్యుల నియామకాలు జరపకుండా, కేంద్రం నుంచి వచ్చిన నిధులను పక్కదారి మళ్లించి వైద్యం ప్రజలకు అందకుండా పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వమే అడ్డుకుంటోందన్నారు. మరోవైపు భవనాల కొరతతో ఆయుష్ అభివృద్ధికి నోచుకోలేదన్నారు.ఎన్‌టీఆర్ వైద్యసేవ, ఉద్యోగశ్రీ, మెడికల్ రియంబర్స్‌మెంట్ విషయాల్లోనూ ఆయుష్ వైద్యులకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నేషనల్ ఆయుష్ మిషన్ బడ్జెట్‌ను ఆయుష్‌కు కేటాయించి అభివృద్ధి చేయాలన్నారు. సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ జగన్‌మోహన్‌మూర్తి, సహాయ కార్యదర్శులు డాక్టర్ నాగేశ్వరరావు, డాకర్టర్ హయత్, డాక్టర్ ఖాద్రి, డాక్టర్ జలీల్, డాక్టర్ నరసింహారెడ్డి, డాక్టర్ మహేశ్వరరెడ్డి, డాక్టర్ భారితి, డాక్టర్ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.