గిరిజనుల సంక్షేమాన్ని మరచిన ప్రభుత్వం
– సొంత పూచికత్తుపై రుణాలు అందించాలని ఏపీజీఎస్ దీక్షలు
కర్నూలు(అర్బన్): రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల సంక్షేమాన్ని మరచిందని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య (ఏపీజీఎస్) నేతలు ధ్వజమెత్తారు. బ్యాంకులతో ప్రమేయం లేకుండా సొంత పూచికత్తుపై రుణాలు అందించాలని డిమాండ్ చేస్తూ ఏపీజీఎస్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక సంక్షేమభవన్ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఏపీజీఎస్ జిల్లా అధ్యక్షుడు జి. జయరామ్‌నాయక్ అధ్యక్షతన చేపట్టిన దీక్షలను బీకేఎంయు రాష్ట్ర అధ్యక్షుడు ఎ. శేఖర్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. మునెప్ప, ఏపీజీఎస్ జిల్లా కార్యదర్శి వెంకటరాముడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అదిగో గిరిజనుల అభివృద్ధి అంటూ ప్రభుత్వం ప్రచారం చేస్తుందే తప్ప ఎలాంటి నిధులను విడుదల చేయడం లేదన్నారు. ఎస్‌టీ కార్పొరేషన్ ద్వారా నిజమైన గిరిజనులకు రుణాలు అందడం లేదని, మధ్య దళారులు, రాజకీయ నాయకులు, బ్యాంకర్లు కుమ్మక్కై సబ్సిడీని పంచుకుంటున్నారని ఆరోపించారు. దీక్షా కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కారుమంచి, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, ఏపీజీఎస్ నాయకులు బనగానపల్లె రాముడు, జిల్లా గౌరవాధ్యక్షుడు మారెన్న, ఆటో యూనియన్ నాయకులు రామ్‌నాయక్, కె. శ్రీనివాసులు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.