‘పెద్దలకు’ ప్రేమతో..!
పేదల ‘అసైన్డ్’ భూములను కొల్లగొట్టిన వారికి సర్కారు అండదండ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తరువాత పేదలకు సెంటు భూమి కూడా పంపిణీ చేయకపోగా ఇప్పుడు పేదలకు చెందిన అసైన్డ్ భూములు కొల్లగొట్టిన వారికి అండగా నిలవాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా నూతన రాజధానిలో పరిధిలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పేదల అసైన్డ్ భూములను మంత్రులు, అధికార పార్టీ నేతలు బలవంతంగా తక్కువ ధరలకు కాజేశారు. ఇప్పుడు ఆ భూములను క్రమబద్ధీకరణ చేసి, చట్టబద్ధత కల్పించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇదంతా ఓ పథకం ప్రకారం వ్యూహాత్మకంగా నడిపించారు.
రాజధానిలో మీ భూములు పోతాయని, ప్రభుత్వమే తీసేసుకుంటుందని, పైసా ఇవ్వదంటూ మంత్రులు, అధికార పార్టీ నేతలు పేదలను భయభ్రాంతులకు గురిచేశారు. రూ.కోట్లు విలువ చేసే భూములను చౌకగా కొనుగోలు చేసి బినామీల పేరు మీద రాయించేసుకున్నారు. ముందస్తు జాగ్రత్తగా ఆ రాతపత్రాలను, డబ్బులివ్వడాన్ని వీడియోల్లో చిత్రీకరించారు. అలా రాజధాని ప్రాంతంలోని వేల ఎకరాల అసైన్డ్ భూములను తన పార్టీ నేతలతో కొనుగోలు చేయించాక చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అసైన్డ్ భూములను విక్రయించుకునే వెసులుబాటు పేదలకు కల్పిస్తున్నామనే ముసుగులో అధికార పార్టీ నేతలకు ఆ భూములపై చట్టబద్ధత కల్పించి రూ.కోట్ల లబ్ధి చేకూర్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
ఇందులో భాగంగా ఏకంగా 1977 అసైన్డ్ చట్టంలో సవరణలు తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. అసైన్డ్ చట్టంలో సవరణలకు సవివరమైన ప్రతిపాదనలు అత్యవసరంగా పంపాల్సిందిగా ముఖ్యమంత్రి కార్యాలయం సీసీఎల్‌ఎకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అసైన్డ్ చట్టం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన కార్యకలాపాలపై పూర్తి వివరాలను అందజేయాల్సిందిగా గుంటూరు, కృష్ణా జిల్లాల కలెక్టర్లకు సీసీఎల్‌ఏ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ల నుంచి వివరాలు వచ్చిన తరువాత పూర్తి వివరాలతో చట్ట సవరణకు సీసీఎల్‌ఏ ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించనున్నారు.
పార్టీ నేతల ప్రయోజనం కోసమే...
వైఎస్ సర్కారు అసైన్డ్ భూముల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయగా... ఇప్పుడు చంద్రబాబు సర్కారు మాత్రం ఆ చట్టం స్పూర్తికే తూట్లు పొడుస్తూ అసైన్డ్ భూములను కొల్లగొట్టిన అధికార పార్టీ పెద్దలకు ప్రయోజనం కల్పించేలా వ్యవహరిస్తోంది. అన్యాక్రాంతమైన అసైన్డ్ భూములు స్వాధీనం చేసుకోవడంతోపాటు క్రిమినల్ కేసులు పెట్టేందుకు వీలుగా వైఎస్ ప్రభుత్వం 2007- 2008లో అసైన్డ్ చట్టానికి సవరణలు కూడా చేసింది. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అధికారపార్టీ నేతలకు రూ.కోట్ల లబ్ధి చేకూర్చేందుకు అసైన్డ్ చట్టానికి సవరణలు చేసి పేదల కడుపులు కొట్టేందుకు సిద్ధమవుతోంది. 1954 ముందే అసైన్డ్ భూముల చట్టం ఉంది. అయితే ఆ చట్టం ప్రకారం అసైన్డ్ భూములను విక్రయించరాదని, కొనుగోలు చేయరాదనే నిబంధన ఏదీ లేదు.
1954 తరువాత అసైన్డ్ భూములను విక్రయించరాదనే నిబంధనను తీసుకువచ్చారు. ఆ తరువాత 1964లో చట్ట సవరణ, 1977 చట్ట సవరణల్లో అసైన్డ్ భూములను విక్రయించరాదని, కొనుగోలు కూడా చేయరాదనే నిబంధనను విధించారు. కొనుగోలు చేసిన వారిపై కేసులు నమోదు చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందనే నిబంధనను 1977 చట్ట సవరణలో పేర్కొన్నారు. అయినా అధికార పార్టీ నేతలు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో యధేచ్ఛగా అసైన్డ్ భూములు కొనుగోలు చేశారు. అందుకోసం అన్ని రకాల అక్రమాలకూ పాల్పడ్డారు. అసైన్డ్ భూములను ప్రభుత్వం లాగేసుకుంటుందని, పరిహారం కూడా ఇవ్వదని రైతులను భయపెట్టారు.
అసైన్డ్ భూములను ఎకరా కేవలం రూ.పది లక్షలకే సొంతం చేసుకున్నారు. భూమిదారులకు ఎలాంటి పత్రాలు లేకపోయినా ఫర్వాలేదంటూ... కేవలం రేషన్‌కార్డు, ఆధార్ కార్డు చూసి భూములు కొనుగోలు చేశారు. అసైన్డ్ భూములను ఎలాగైనా రెగ్యులరైజ్ చేయించుకోగలమనే ధీమాతోనే వారు అలా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఆ వ్యూహంలో భాగంగానే ఇప్పుడు అసైన్డ్ భూముల చట్టానికి సవరణలు చేయడం ద్వారా అక్రమంగా కొన్న భూములను సక్రమం చేసి అధికార పార్టీ నేతలకు రూ.కోట్ల రూపాయల్లో లబ్ధి చేకూర్చేందుకు సర్కారు సన్నాద్ధమవుతోంది.
రాజధాని నగర పరిధిలో 2,028 ఎకరాలు అసైన్డ్ భూములు
రాజధాని నగర పరిధిలో దాదాపు 2,028 ఎకరాలు అసైన్డ్ భూములున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అలాగే రాజధాని పరిధిలోని 13 లంకల్లో అన్ని రకాల భూములు కలిపి 2,159.17 ఎకరాలున్నాయి. ఈ మొత్తం 4,187 ఎకరాల్లో అధికభాగం భూములను అధికార పార్టీ నేతలు కారుచౌకగా కొనుగోళ్లు చేశారు. ప్రస్తుత అసైన్డ్ చట్టం ప్రకారం చేతులు మారిన అసైన్డ్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. కానీ భూములు అధికార పార్టీ నేతల చేతుల్లో ఉండటంతో ప్రభుత్వం అలా చేయకూడదని నిర్ణయం తీసుకుంది. అసైన్డ్ భూములను అక్రమంగా కొనుగోలు చేసినప్పటికీ పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. రాజధాని నగర పరిధిలో 60 ఎకరాలు మాజీ సైనికోద్యోగులకు, రాజకీయ సామాజిక బాధితులకు కేటాయించారు. ఆయా భూములను పదేళ్లపాటు అనుభవించిన తరువాత విక్రయించుకునే హక్కులున్నాయి. ఆ భూములకు కూడా పరిహారం చెల్లించాలని నిర్ణయించారు.
బలహీన వర్గాలకు తీవ్ర నష్టం
సీసీఎల్‌ఏ వద్ద గత ఏడాదివరకు ఉన్న సమాచారం మేరకు రాష్ట్రంలో 28 లక్షల ఎకరాల అసైన్డ్ భూములను పంపిణీ చేసినట్లు లెక్కలున్నాయి. ఇందులో ఏడు లక్షల ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు, మరో మూడు లక్షల ఎకరాలకు రికార్డులను తేల్చాల్సిన అవసరం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పుడు అధికార పార్టీ వారికి లబ్ది చేకూర్చేందుకు రెండు జిల్లాల్లో చేస్తున్న సవరణలను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తే అసైన్డ్ భూములు పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు, బలహీన వర్గాలు తీవ్రంగా నష్టపోతారని అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. బడుగువర్గాల అవసరాలను ఆసరాగా తీసుకుని బలవంతులు అసైన్డ్ భూములు కొనుగోలు చేసి క్రమబద్ధీకరణ చేయించుకుంటారని, ఫలితంగా బడుగులు శాశ్వతంగా భూమికి దూరమవుతారని హెచ్చరిస్తున్నారు. అధికార పార్టీ నేతలు పలుకుబడి ఉపయోగించి పేదలకు భూములు మంజూరు చేయించి, ఆ తర్వాత వారే కొనుగోలు చేసే అవకాశాలూ లేకపోలేదని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
నిరుపేదలకు అన్యాయం..
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డీసీ రోశయ్య
ప్రస్తుత చట్టం 9 ఆఫ్ 1977 అసైన్డ్ చట్టం ప్రకారం ఎవరూ అసైన్డ్ భూములను కొనుగోలు చేయరాదు, విక్రయించరాదు. అసైన్డ్‌దారుల నుంచి ఎవరైనా కొనుగోలు చేసినా చట్ట ప్రకారం ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ఆ స్వాధీనం చేసుకున్న భూములను ఒరిజనల్ అసైన్డ్‌దారు జీవించి ఉంటే అతనికే అప్పగించాలి. ఒరిజనల్ అసైన్డ్‌దారు జీవించి లేకపోతే చట్టబద్ధమైన వారసులుంటే వారికే ఆ భూములను అప్పగించాల్సి ఉంది. ఎట్టిపరిస్థితుల్లోను అసైన్డ్ భూముల క్రయ, విక్రయాలకు వీలు కల్పించరాదు. అలా చేస్తే చట్టం స్ఫూర్తికి తూట్లు పొడవడమే. ఈ చట్టం ప్రకారం భూమిలేని నిరుపేదలకు ఇచ్చిన వ్యవసాయ భూమిని ఎట్టిపరిస్థితుల్లోను మరొకరికి హక్కు కల్పించడం సాధ్యం కాదు. ఇప్పుడు ఈ చట్ట సవరణ చేస్తే ఎస్సీ, ఎస్టీలకే కాదు బీసీలకు కూడా అన్యాయం జరుగుతుంది. ఈ చట్టంలో సవరణ చేయాలంటే రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి.