దొంగలను గుర్తించిన జీపీఎస్
దొంగలను గుర్తించిన జీపీఎస్
Published Sat, Mar 4 2017 12:13 AM | Last Updated on Tue, Aug 28 2018 7:30 PM
- రెండు రోజుల క్రితం కర్ణాటకలో డీజిల్ ట్యాంకర్ అపహరణ
- లారీ డ్రైవర్, క్లీనర్‌ను కట్టేసిన దుండగులు
- జీపీఎస్ సహాయంతో విముక్తి కలిగించిన పోలీసులు
- పోలీసుల అదుపులో ఒకరు, పరారీలో ఇద్దరు
వెల్దుర్తి రూరల్: కేసుల ఛేదనలో పోలీసులకు ఆధునిక సాంకేతిక అభివృద్ధి ఎంతో సహకరిస్తుందనడానికి ఈ ఘటన ఓ ఉదాహరణ. కర్ణాటకలో అపహరణకు గురైన డీజిల్ ట్యాంకర్‌ను జీపీఎస్ సహాయంతో పోలీసులు గుర్తించారు. దుండగులు వెల్దుర్తి పట్టణ సమీపంలోని రామళ్లకోట రోడ్డులోని పెట్రోల్ బంక్ సమీపంలో దాచిన ట్యాంకర్ ఆచూకీని గురువారం రాత్రి గుర్తించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు కర్ణాటకలోని హసన్ జిల్లా కేంద్రంలోని హెచ్‌పీసీఎల్ కంపెనీ నుంచి ట్యాంకర్‌లో 20వేల లీటర్ల డీజిల్ నింపుకుని క్లీనర్‌తో పాటు డ్రైవర్ మణి బెంగళూరు వైపు బయలుదేరాడు. టౌన్ దాటగానే ముగ్గురు వ్యక్తులు పోలీసులు దుస్తుల్లో వచ్చి ట్యాంకర్‌ను ఆపి తాము అటు వైపు వెళ్లాలంటూ ఎక్కారు. ట్యాంకర్ హసన్ దాటి ఘాట్ ప్రాంతానికి చేరుకోగానే లారీ ఆపమని చెప్పి డ్రైవర్, క్లీనర్‌పై దాడి చేసి తాళ్లతో కట్టివేసి, ట్యాంకర్ క్యాబిన్‌లోనే సీట్ల కింద దాచారు. అక్కడ దారి మళ్లిన ట్యాంకర్‌ను కంపెనీ వారు జీపీఎస్ సిస్టం ద్వారా గుర్తించారు. కర్నూలు జిల్లా, రామళ్లకోట ప్రాంతంలో ఉన్నట్లు గురువారం సాయంత్రం గుర్తించి అక్కడి పోలీసులకు తెలుపగా, వారు వెల్దుర్తి పోలీసులకు సమాచారమందించారు.
వెంటనే రంగంలోకి దిగిన ఎస్‌ఐ, టీం రామళ్లకోట ప్రాంతంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రోడ్డుపై ఎక్కడా జాడ కానరాలేదు. చివరకు రాత్రి 11 గంటల ప్రాంతంలో వెల్దుర్తి సమీపంలో వేణు ఇటుకల ఫ్యాక్టరీ పక్కన ముళ్ల పొదల మధ్య ట్యాంకర్‌ను గుర్తించారు. పోలీసులను చూసి ట్యాంకర్‌లో ఉన్న ముగ్గురు నిందితులు పరారవుతుండగా ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు పరారయ్యారు. ట్యాంకర్ క్యాబిన్‌లో సీట్ల కింద కట్టేసిన డ్రైవర్ మణి, క్లీనర్‌ను బయటకు తీశారు. రెండు రోజులుగా తిండి, నీళ్లు లేక అపస్మారక స్థితిలో ఉండడం చూసి వారికి సపర్యలు చేశారు. పట్టుబడిన వ్యక్తి అభిషేక్‌ను విచారించగా దుండగులు కర్ణాటక రాష్ట్రం బెంగళూరు వాసులుగా గుర్తించినట్లు ఎస్‌ఐ తులసీనాగప్రసాద్ తెలిపారు. నవీన్, హరీష్ పరారీలో ఉన్నారని, కేసు నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Advertisement