నెట్‌వర్క్ ఆస్పత్రులకు గ్రేడింగ్
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులు, జర్నలిస్టు లకు 12 కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్య పథకాన్ని అమలు చేయడానికి 40 శాతం వరకు ప్యాకేజీ పెంచిన ప్రభుత్వం... ఇప్పుడు ప్రైవేటు నెట్‌వర్క్ ఆస్పత్రులకూ త్వరలో ప్యాకేజీ పెంచాలని నిర్ణయించింది. ఆయా నెట్‌వర్క్ ఆస్పత్రులకు గ్రేడింగ్‌లు ఇచ్చాక ప్యాకేజీ పెంపుపై నిర్ణయం తీసుకో వాలని నిర్ణయించింది. గ్రేడింగ్ కోసం ఉద్యో గులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం (ఈజే హెచ్‌ఎస్) సీఈవో డాక్టర్ కల్వకుంట్ల పద్మ ఆధ్వర్యంలో కమిటీ వేయాలని నిర్ణయిం చింది. కమిటీలో కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్‌లు సభ్యులు గా ఉంటారు. ఆ కమిటీ 230 నెట్‌వర్క్ ఆస్పత్రులను అధ్యయనం చేసి నెలరోజుల్లో నివేదిక ఇవ్వనుంది.
ఆస్పత్రులను ఎ, బి, సిలుగా వర్గీకరించి దాని ప్రకారం ప్యాకేజీ పెంచాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణ యించింది. ఈ ప్యాకేజీ ఆరోగ్యశ్రీలోని పేదరోగులకు ఇది వర్తించదని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ఉద్యోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలంటే ఆరోగ్యశ్రీ ప్యాకేజీ సరిపోదని కార్పొరేట్ ఆస్పత్రులు రెండేళ్లుగా వైద్యసేవలు ఇవ్వడానికి నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కార్పొ రేట్లకు ప్యాకేజీ పెంచిన ప్రభుత్వం నెట్‌వర్క్ ఆస్పత్రులకూ పెంచాలని నిర్ణయించింది. నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో వసతులు, స్పెషలిస్టు వైద్యులు, అందించే వైద్యసేవలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని వాటిని వర్గీకరించాక గ్రేడింగ్‌ల ప్రకారం వాటికి ప్యాకేజీ పెంచాలని నిర్ణయించారు.