
ఘనంగా మదర్ థెరిస్సా జన్మదిన వేడుకలు
కోదాడఅర్బన్: దేశంలో అనాథలకు, అభ్యాగులకు సేవలందించి విశ్వమాతగా పేరుపొందిన మదర్ థెరిస్సా జన్మదిన వేడుకలను శుక్రవారం కోదాడ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యాలయ సమీపంలోని ఆమె విగ్రహానికి పలువురు కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టణంలోని తేజ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పలువురు విద్యార్థులు మదర్ థెరిస్సా వేషధారణలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణ పరిధిలోని మానసిక వికలాంగుల కేంద్రంలోని విద్యార్థులకోసం పాఠశాల 10వ తరగతి విద్యార్థులు పండ్లు, బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మట్లాడుతూ మదర్ థెరిస్సా చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు కత్రం నాగేందర్‌రెడ్డి, సయ్యద్ ముస్తఫా, సంజీవ్‌రెడ్డి, రవి, తేజ పాఠశాల డైరక్టర్ జానకిరామయ్య, ప్రధానోపాధ్యాయుడు అప్పారావు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.