పైసా లేకుండా పారిశుద్ధ్య పనులెలా?
బోట్‌క్లబ్ (కాకినాడ) : ప్రస్తుతం జిల్లాలో పారిశుద్ధ్య లేమి కారణంగా ప్రజలు పలు అనారోగ్యాలకు గురవుతున్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండడంతో రోజురోజుకీ ఆసుపత్రి పాలయ్యేవారి సంఖ్య పెరిగిపోతోంది. డెంగీ జ్వరాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో ఉన్నతాధికారులు గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని గ్రామ కార్యదర్శులను ఆదేశిస్తున్నారు. గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన 14 ఆర్థిక సంఘ నిధులు ఇవ్వకపోవడంతో జిల్లాలోని పలు గ్రామ పంచాయతీలు పైసా కూడా లేదు. దీంతో ప్రస్తుతం పారిశుద్ధ్య పనులు చేసేందుకు డబ్బులు లేకపోవడంతో సర్పంచులు, కార్యదర్శులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలో 1069 గ్రామ పంచాయతీలుండగా వీటిలో 350కిపైగా మేజర్ పంచాయతీలున్నాయి. ఈ పంచాయతీల్లో నిధులకు అంతగా ఇబ్బందులు లేవు. మిగిలిన 719 పంచాయతీల్లో సగానికిపైగా పంచాయతీల్లో డబ్బులు లేక అవస్థలు
పడుతున్నారు. పారిశుద్ధ్య పనులు చేసేందుకు ఆర్థిక సమస్యలు తలెత్తడంతో డ్రైయిన్‌లో పూడిక తీత, రోడ్లపై చెత్త పేరుకుపోతోంది. ఇంటి పన్నులు మీద వచ్చే ఆదాయం గ్రామ పంచాయతీల్లో పనిచేసే సిబ్బందికే సరిపోతోంది. ఇక పారిశుద్ధ్య పనులు చేసే అవుట్ సోర్సింగ్ ఇబ్బందికి నెలనెలా జీతాలు ఇవ్వడానికి, కచ్చా డ్రైయిన్లు తవ్వేందుకు, విద్యుత్ దీపాలు మెయింటినెన్స్‌కు డబ్బులు సరిపోని పరిస్థితి ఉంది.
ఆర్థిక సంఘ నిధులేవీ...
గత మార్చి నెల్లో ఇవ్వాల్సిన 14వ ఆర్థిక సంఘ నిధులు ఇంకా పంచాయతీలకు ఇవ్వలేదు. సంవత్సరానికి రెండు దఫాలుగా 14వ ఆర్ధిక సంఘ నిధులు గ్రామ పంచాయతీలకు జమ చేస్తుంటారు. గత మార్చిలో జిల్లాకు రావాల్సిన రూ. 74.78 కోట్లు ఇంకా జమకాలేదు. దీంతో పలు గ్రామ పంచాయతీ అకౌంట్స్ జీరో బ్యాలెన్స్‌లో ఉన్నాయి. జిల్లాలోని పెద్దాపురం మండలం తాటిపర్తి, తిరుపతి, కిర్లంపూడి మండలం గోనాడ, పాలెం, గండేపల్లి మండలం మురారి, ఎస్ . తిమ్మాపురం, ప్రత్తిపాడు మండలం రాచపల్లి, తుని మండలం డి పోలవరం, అనపర్తి మండలం పేర రామచంద్రపురం, కెగంగవరం మండలం దంగేరు, కడియం మండలం మురముండ,మండపేట మండలం మారేడుబాక, రామచంద్రపురం మండలం చోడవరం, ఉప్పలగుప్తమండలం భీమనపల్లి, నంగవరం, పిగన్నవరం మండలం ముంగడపాలెం, ఆత్రేయపురం , ముమ్మిడివరం మండలం గేదెల్లంక తదితర గ్రామాల్లో రూపాయి కూడా లేదు.
అప్పులు చేసి పారిశుద్ధ్య పనులు...
ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధా్యనికి ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా రోజు గ్రామాల్లోని రోడ్డుపై పేరుకొనపోయిన చెత్తా, చెదారం , డ్రైయిన్‌లోని పూడిత తీయడం, మంచినీటి పథకాలు శుభ్రం చేయడం, రోడ్లుపై తడిగా ఉన్నా ప్రాంతాల్లో బ్లీచింగ్ జల్లడం వంటి పనులు చేయాలని సర్పంచులు, కార్యదర్శులు ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఉన్న సిబ్బందితో ఈ కార్యక్రమాలు చేయాలంటే కష్టం కావడంతో తాత్కాలిక సిబ్బందిని నియమించి పనులు చేస్తున్నారు. వీరికి డబ్బులు ఇచ్చేందుకు సర్పంచి, కార్యదర్శులు అప్పులు చేస్తున్నారు.