- రిజర్వాయర్ కోసం శ్మశానం తొలిగిస్తే చనిపోయినవాళ్లను ఎక్కడపెట్టాలి?
- ప్రత్యామ్నాయ స్థలం చూపిస్తే రాజధాని ఠీవి తగ్గట్లు గొప్ప శ్మశానం కడతాం
- సీఆర్ డీఏ కు కృష్ణాయపాలెం గ్రామపంచాయతీ వినతి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి ప్రాంతంలోని కృష్ణాయపాలెం(మంగళగిరి మండలం) గ్రామానికి ఊహించని సమస్య ఎదురైంది. ఆ ఊరికి ఉత్తరాన ఉన్న శ్మశానం.. త్వరలో నిర్మించనున్న రిజర్వాయర్ లో మునిగిపోతుందని సీఆర్ డీఏ అధికారులు ప్రకటించడమే సమస్యకు అసలు కారణం. రిజర్వాయర్ నిర్మాణానికి భూమి తీసుకుంటామన్న అధికారులు.. శ్మశానానికి ప్రత్యామ్నాయంపై మాత్రం పెదవి విప్పడంలేదు. దీంతో సీఆర్ డీఏ తీరును తప్పుపడుతూ బుధవారం సర్పంచ్ ఈపూరి కన్నయ్య అధ్యక్షతన జరిగిన పంచాయతీ సమావేశం తీర్మానాలు చేసింది.
రాజధాని నిర్మాణం నిమిత్తం ప్రస్తుతం ఉన్న గ్రామాలను కదిలించబోమనే ప్రభుత్వ హామీని నమ్మి భూములు ఇచ్చామని, ఊరంతటికీ ఉపయోగపడే శ్మశానాన్ని తొలగిస్తామన్న అధికారుల నిర్ణయాన్ని గ్రామపంచాయతీ సాధారణ సమావేశం ఏకగ్రీవంగా వ్యతిరేకించింది. శ్మశానం స్థలాన్ని మినహాయించి రిజర్వాయర్ నిర్మించాలని, అలా కుదరని పక్షంలో గ్రామానికి ఉత్తరంగా ప్రత్యామ్నాయస్థలాన్ని చూపిస్తే గ్రామంలోని ప్రతి రైతూ గజానికి రూ. ఒకటి వంతున చందా వేసుకుని ప్రపంచస్థాయి శ్మశానం నిర్మించుకుంటామని, అందుకు తగిన చర్యలు చేపట్టాలని తీర్మానంలో కోరారు. తీర్మానాల ప్రతిని సీఆర్‌డీఏ కార్యాలయంలో గ్రామం తరపున అందచేశారు.
ప్రపంచస్థాయి శ్మశానం నిర్మిస్తాం
Published Wed, Jan 27 2016 8:42 PM | Last Updated on Fri, May 25 2018 7:04 PM
Advertisement