..ఎందుకిలా!
..ఎందుకిలా!
Published Tue, Feb 23 2016 9:30 AM | Last Updated on Sun, Sep 3 2017 6:15 PM
గ్రేటర్ ఎన్నికలకు దూరంగా మంత్రి చందూలాల్
- సమన్వయ కమిటీలో దక్కని చోటు
-పక్కన పెట్టిన టీఆర్ఎస్ నాయకత్వం
తెలంగాణ మంత్రి చందూలాల్ ను గ్రేటర్ వరంగల్ సమన్వయ కమిటీలోకి తీసుకోకపోవడంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. సాక్షాత్తూ ఒక మంత్రిని జిల్లా కేంద్రంలో జరగుతున్న ఎన్నికలకు దూరంగా పెట్టడం అంటే పెద్ద విషయమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సాక్షి ప్రతినిధి, వరంగల్: గిరిజన సంక్షేమ, పర్యాటక శాఖల మంత్రి అజ్మీరా చందూలాల్ కు టీఆర్ఎస్ లో పార్టీ పరంగా సరైన గుర్తింపు దక్కడం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. పార్టీకి సంబంధించిన కీలక కార్యక్రమాలకు చందూలాల్ ను ఉద్దేశపూర్వకంగానే దూరం పెడుతున్నారని ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ లో వరుసగా జరుగుతున్న పరిణామాలు ఈ అభిప్రాయాలకు బలం చేకూరుస్తున్నాయి. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ ఎన్నికల కార్యక్రమాల్లో చందులాల్‌కు ప్రత్యేకంగా ఎలాంటి బాధ్యతలు అప్పగించ లేదు. తాజాగా గ్రేటర్ వరంగల్‌కు జరుగుతున్న ఎన్నికల్లోనూ ఇలాంటి పరిస్థితే పునరావృతమైంది. వరంగల్ మహా నగరపాలక సంస్థ(జీడబ్ల్యూఎంసీ)లోని 58 డివిజన్లలో భారీ అధిక్యం లక్ష్యంగా టీఆర్‌ఎస్ వ్యూహాలు అమలు చేస్తోంది. గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో ప్రచార బాధ్యతలను టీఆర్‌ఎస్ అధిష్టానం పూర్తిగా జిల్లా నేతలకే అప్పగించింది. అన్ని డివిజిన్లలో బలమైన అభ్యర్థులను ఎంపిక చేయడం, ప్రచార వ్యూహాలు, రెబల్ అభ్యర్థులకు సర్దిచెప్పడం.. వంటి కీలక వ్యవహారాలను చక్కబెట్టేందుకు టీఆర్‌ఎస్ తొమ్మిది మంది సభ్యులతో ప్రత్యేకంగా కమిటీని నియమించింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలోని ఈ కమిటీలో గ్రేటర్ వరంగల్ పరిధిలోని ఎమ్మెల్యేలు టి.రాజయ్య, కొండా సురేఖ, దాస్యం వినయభాస్కర్, అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డితోపాటు వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి, ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావులను సభ్యులుగా నియమించారు.
రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత పెద్ద నగరమైన గ్రేటర్ వరంగల్‌లో జరుగుతున్న ఎన్నికల కోసం నియమించిన కమిటీలో చందులాల్‌కు చోటు కల్పించలేదు. రాష్ట్ర మంత్రిగా వ్యవహరిస్తున్న చందూలాల్‌ను గ్రేటర్ వరంగల్ సమన్వయ కమిటీలో నియమించకపోవడంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. సాక్షాత్తూ ఒక మంత్రిని జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఎన్నికకు దూరంగా పెట్టడం అంటే పెద్ద విషయమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మూడు నెలల క్రితం టీఆర్‌ఎస్‌లో చేరిన రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణిని గ్రేటర్ ఎన్నికల సమన్వయ కమిటీలో సభ్యురాలిగా నియమించి... రాష్ట్ర మంత్రిని పక్కనబెట్టడం ఏమిటని చందూలాల్ అనుచరుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టీఆర్‌ఎస్‌లో, ప్రభుత్వంలో చందులాల్‌కు పెద్దగా ప్రాధాన్యత లేదని, తాజాగా ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీలో ఇదే స్పష్టమైందని మంత్రి వ్యతిరేకులు అంటున్నారు. చందూలాల్ సన్నిహితులు, వ్యతిరేకుల అభిప్రాయాలు ఎలా ఉన్నా... రాష్ట్ర మంత్రిగా ఉన్న వ్యక్తిని ఎన్నికల కార్యక్రమాలకు దూరం పెట్టడం మాత్రం టీఆర్‌ఎస్‌లో పెద్ద చర్చకు దారి తీస్తోంది.
టీఆర్‌ఎస్‌లో సీనియర్ నేతగా, కేసీఆర్‌కు సన్నిహితుడిగా అజ్మీరా చందూలాల్‌కు గుర్తింపు ఉంది. గిరిజనుల కోటాలో 2014 డిసెంబర్‌లో ఆయనకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలతో చందులాల్‌కు గతంలో ఉన్న ప్రాధాన్యత లేదని టీఆర్‌ఎస్‌లో ప్రచారం జరుగుతోంది. దీంట్లో భాగంగానే చందులాల్‌ను గ్రేటర్ ఎన్నికల సమన్వయ కమిటీకి దూరం పెట్టారని తెలుస్తోంది.
‘గ్రేటర్ వరంగల్ సమన్వయ కమిటీలో తొమ్మిది మంది ఉన్నారు. ఎస్సీ, బీసీ, ఓసీ... అన్ని వర్గాల వారికి చోటు కల్పించారు. తొమ్మిది మందిలో ఒక్క ఎస్టీ నేత లేరు. ప్రత్యేక రాష్ట్రంలో ఎస్టీలకు ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పిన టీఆర్‌ఎస్ ప్రకటనకు తాజా కమిటీ తీరు విరుద్ధంగా ఉంది’ అని టీఆర్‌ఎస్‌లోని ఎస్టీ నేతలు అంటున్నారు.
మేడారం జాతర వల్లే : డిప్యూటీ సీఎం కడియం
మేడారం జాతర నిర్వహణలో బిజీగా ఉండడం వల్లే చందూలాల్‌కు గ్రేటర్ వరంగల్ ఎన్నికల సమన్వయ కమిటీలో చోటు కల్పించలేదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. వరంగల్ నగరంలో ఓటు హక్కు ఉన్న వారికి కమిటీలో చోటు కల్పించినట్లు వివరించారు. సోమవారం హన్మకొండలోని ఓ హోట ల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఓ ప్రశ్నకు సమాధానంగా కడియం ఈ వివరణ ఇచ్చారు.
Advertisement
Advertisement