నేడు 67 వనమహోత్సవం
’జిల్లాలో తగ్గుతున్న అడవుల విస్తీర్ణం
మొక్కలే సకల జీవుల మనుగడకు మూలాధారం. మారుతున్న కాలంలో అడవుల విస్తీర్ణం తగ్గుతోంది. ఇది జీవకోటికి ముప్పుగా పరిణమిస్తుంది. అందుకే ఇప్పటికే వనం వైపు మనం సాగాలన్న సంకేతాలు జనంలోకి వెళుతున్నాయి. ఈ క్రమంలో అందరి శ్వాస, ధ్యాస హరిత హితం కావాలన్న జాగురుకతతో నేటి తరం ముందుకు సాగాల్సి ఉంది. అందుకే అటవీశాఖ నవ్యాంధ్రను హరితాంధ్రగా మార్చడానికి ప్రజలను చైతన్య పరిచి, మొక్కల పెంచాలన్న ఆశయంతో ముందుకు సాగుతోంది. నేడు వనమహోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
పలమనేరు:
పర్యావరణంతో మానవ మనుగడ ముడిపడి ఉంది. పర్యావరణ సమతుల్యత పరిరక్షణలో ప్రతి జీవరాశి తనవంతు పాత్రను పోషిస్తుంది. రకరకాల జీవరాసులు మనుగడతోనే మానవ మనుగడ సాధ్యమవుతుంది. వీటి సంఖ్య తగ్గే కొద్ది ఆ ప్రభావం మానవుడి మనుగడపై పడుతుంది. జీవవైవిధ్యాన్ని కాపాడుకోవాంటే అడవులు విస్తీర్ణం పెరగాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రతి ఒక్కరు పచ్చదనాన్ని పెంపొందించుకోవడానికి నడుం బిగించాలి. ఇదే తలంపుతో రాష్ట్ర ప్రభుత్వం వనం–మనం పేరుతో ఏటా జూలై 29న వనమహోత్సవాన్ని జరుపుతోంది. ఇందులో భాగంగానే ప్రజల భాగస్వామ్యంతో నేడు రాష్ట్రంలో కోటి మొక్కలను నాటేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ క్రమంలోనే జిల్లాలో సుమారు 15 లక్షల మొక్కలను నాటేలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. అందుకే వనమహోత్సవాన్ని అటవీశాఖ ద్వారా నిర్వహిస్తోంది.
తగ్గుతున్న అడవుల విస్తీర్ణం....
జిల్లాకు సంబంధించి భౌగోళిక అటవీ ప్రాంతం 15,151 చదరపు కిలోమీటర్లు. ఇందులో ఏడు ప్రాంతాల్లో మాత్రం అతి దట్టమైన అడవులు, 29 ప్రాంతాల్లో దట్టమైన అడవులున్నాయి. ఓపెన్ ఫారెస్ట్‌గా 1463 కి,మీ, మిగిలినవి చట్టడవులుగా వ్యాపించి ఉన్నాయి. మొత్తం విస్తీర్ణంలో అడవులు 15.83 శాతం విస్తరించి ఉన్నాయి. అయితే గత పదేళ్లలో అడవుల విస్తీర్ణంలో మూడు శాతం తగ్గడం ఆందోళన కలిగిస్తోంది.
అడవుల బలహీనం.. వన్యప్రాణుల ఉనికి ముప్పు
జిల్లాలోని శేషాచలం, కౌండిన్య అడవులు వన్యప్రాణులకు నిలయాలుగా ఉన్నాయి. ఈ అడవుల్లో వందలాది ఏనుగులు, వేలాది జింకలు, దుప్పులు, కణితలు, ఎలుగుబంట్లు, కొన్ని హైనాలు, చీటాలు ఉన్నాయి. వీటితో పాటు అడవి గొర్రెలు, కుందేళ్లు, బావురు పిల్లులు, ఉడుములు, నక్కలు, నెమళ్లు ఉన్నాయి. ఇవిగాక 40 రకాల క్షీరదాలు,160కి పైగా పలురకాల పక్షులు, అరుదైన కొంగలు, వంద రకాల సీతాకోక చిలుకలు, నక్షత్ర తాబేళ్లు, ఇతర కీటకాలతో పాటు మరికొన్ని జంతువులు ఉన్నాయి. అయితే అడవుల విస్తీర్ణం తగ్గి వన్యప్రాణుల సంఖ్య కూడా తగ్గుతోందని అటవీశాఖ ఘణాంకాలు చెబుతున్నాయి.
ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
’శివన్న, ఎఫ్‌ఆర్‌వో, పలమనేరు.
వనం మనంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. మొక్కల పెంపకంపై తమశాఖ ప్రజల్లో అవగాహన కల్పిస్తూనే ఉంది. మొక్కలను పెంచితే కాలుష్యం తగ్గి మానవ మనుగడకు ఎంతో మేలు చేస్తుంది. అందుకే అడవులను రక్షించుకుందాం. కనీసం ఇంటికో మొక్కను పెంచినా చాలు. సమాజంలో మార్పు రావాలి. అప్పుడే పచ్చదనం వెల్లివిరుస్తుంది.