విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వెంకటరమణ
నెల్లూరు (దర్గామిట్ట) : పెళ్లికి ముందే అదనపు కట్నం కోసం వరుడి తల్లిదండ్రులు వేధించడంపై ఓ వధువు తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించి తనకు న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నాడు. వివరాలు... నవాబ్‌పేట నజీర్ తోటలో కాపురం ఉంటున్న గోసుల వెంకటసుబ్బయ్య దత్త పుత్రుడు వెంకటసుధీర్‌కు, కడప జిల్లా బద్వేలుకు చెందిన పాపిశెట్టి వెంకటరమణ కుమార్తె గౌతమికి గత నెల 13న వివాహ నిశ్చితార్ధం జరిగింది. అక్టోబర్ 1న అబ్బాయి ఇంటి వద్ద వివాహం చేయాలని నిర్ణయించారు.
అదేరోజు రూ.11లక్షలు కట్నం ఇచ్చేందుకు అంగీకరించి, కొంత నగదు అడ్వాన్సుగా ఇచ్చినట్లు పాపిశెట్టి వెంకటరమణ తెలిపారు. పెళ్లి ఏర్పాట్లలో ఉండగా గత వారం అబ్బాయి బావ రుద్రా గురయ్య వచ్చి మరో రూ.11 లక్షలు అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేశారని, అదనపు కట్నం ఇవ్వకుంటే పెళ్లి జరగదని బెదిరించారని వాపోయారు. మోసం చేసిన అబ్బాయి తండ్రి విశ్రాంత పోలీస్ అధికారిపై రెండో నగర పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. కుటుంబ, పరువు ప్రతిష్టలు దెబ్బతీసిన అబ్బాయి తల్లిదండ్రులపై పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు.