మూలుగుతున్న గూడేలు.. | Gudelu stashed | Sakshi
Sakshi News home page

మూలుగుతున్న గూడేలు..

Published Tue, Jul 26 2016 11:25 PM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM

వెంకటాపురంలో వైద్యం కోసం బారులు తీరిన రోగులు.. - Sakshi

వెంకటాపురంలో వైద్యం కోసం బారులు తీరిన రోగులు..

  • జ్వరాలతో విలవిలలాడుతున్న ఏజెన్సీ
  • రోజురోజుకు పెరుగుతున్న రోగుల సంఖ్య
  • డాక్టర్ల కొరత.. అంతంతమాత్రంగానే మందులు
  • స్థానికంగా ఉండని వైద్యులు.. గిరిజనుల అవస్థలు
  • జిల్లాలోని పలు పీహెచ్‌సీలను పరిశీలించిన ‘సాక్షి’
  • విస్తారంగా కురుస్తున్న వర్షాలు.. ప్రబలుతున్న జ్వరాలు.. గిరిజన గూడేలు.. పల్లెల్లో ఎక్కడ చూసినా మంచంపట్టిన ఆదివాసీలు.. మలేరియా, టైఫాయిడ్, ఇతర జ్వరాలతో మూలుగుతున్నారు.. చికిత్స కోసం పీహెచ్‌సీలకు వెళ్తున్నా.. అందుబాటులో డాక్టర్లు లేక.. ఉన్నా దూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తుండటంతో సకాలంలో వైద్యం అందని పరిస్థితి.. ముక్కుతూ మూలుగుతూ ఆస్పత్రుల ఎదుట బారులుదీరుతూ వైద్యం కోసం గిరిజనులు అవస్థలు పడుతున్నారు. ఆస్పత్రుల్లో సిబ్బంది కొరతతో వైద్య సేవలు అందడం లేదు. మంగళవారం జిల్లావ్యాప్తంగా పలు పీహెచ్‌సీలను ‘సాక్షి’ పరిశీలించగా.. రోగుల ఇబ్బందులు వెలుగులోకి వచ్చాయి. 
    – సాక్షిప్రతినిధి, ఖమ్మం
     
    జిల్లావ్యాప్తంగా 14 క్లస్టర్ల పరిధిలో 57 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్‌సీలు) ఉన్నాయి. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో 2,760 పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా.. ప్రస్తుతం రెగ్యులర్‌ ఉద్యోగులు 1,422, కాంట్రాక్టు ప్రాతిపదికన 678 మంది పనిచేస్తుండగా.. 659 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సివిల్‌ సర్జన్లు 6, ఎస్‌పీహెచ్‌ఓలు 7, కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లు 18, అసిస్టెంట్‌ పారామెడికల్‌ ఆఫీసర్లు 61, సెకండ్‌ ఏఎన్‌ఎంలు 104, హెల్త్‌ అసిస్టెంట్లు(మహిళలు) 81, పురుషులు 167, డ్రైవర్లు 17, ఫీల్డ్‌ వర్కర్లు 27, ఆఫీస్‌ సబార్డినేట్‌లు 13.. ఇలా సుమారు 50 రకాల పోస్టులకు మొత్తం 659 భర్తీ చేయాల్సి ఉంది. వర్షాకాలం కావడంతో సాధారణంగా ప్రతి ఏటా ఏజెన్సీలో విషజ్వరాలు విజృంభిస్తాయి. మలేరియా, టైఫాయిడ్‌ వస్తే.. చికిత్స అత్యవసరంగా చేయించుకోవాల్సిందే. అయితే డాక్టర్‌ పోస్టులు పీహెచ్‌సీల్లో ఖాళీగా ఉండటంతో.. అక్కడికి వెళ్లిన రోగులకు వెంటనే వైద్యం అందని పరిస్థితి నెలకొంది. అంతేకాక విషజ్వరాలకు సరైన మందులు కూడా పీహెచ్‌సీలలో ఉండటం లేదు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 
    ఏజెన్సీలో అలసత్వం
    ఐటీడీఏ పరిధిలో ఏజెన్సీ వైద్యంపై అలసత్వం నెలకొంది. ఇక్కడ విషజ్వరాలు వస్తే ఆదివాసీలు, గిరిజనులకు పీహెచ్‌సీలే దిక్కు. కానీ.. డాక్టర్లు స్థానికంగా ఉండకుండా భద్రాచలం, కొత్తగూడెం, పాల్వంచ, ఖమ్మం నుంచి కూడా రాకపోకలు చేస్తుండటంతో సకాలంలో విధులకు హాజరుకావడం లేదు. స్థానికంగా ఉండే స్టాఫ్‌నర్సులు, అటెండర్లు, వాచ్‌మన్‌లే రోగులకు తోచిన వైద్యం చేసి పంపిస్తున్నారు. వందల సంఖ్యలో ఓపీ వస్తున్నా.. పట్టనట్లుగానే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వ్యవహరిస్తుండటం గమనార్హం. అంతేకాక వైద్యం కోసం పీహెచ్‌సీలో చేరే రోగులకు వసతులు కూడా సరిగా లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇల్లెందు మండలం కొమురారం పీహెచ్‌సీలో బల్లాలపై పరుపులు లేకపోవడం దీనికి నిదర్శనం. పరుపులున్న చోట చిరిగిపోయి.. దుర్వాసన వెదజల్లుతోంది. మణుగూరు మండలం మొత్తానికి ఒకే పీహెచ్‌సీ ఉంది. రోజుకు 200 మంది వరకు ఓపీ వస్తుండగా.. కేవలం ఒక్కరే వైద్యుడున్నారు. గుండాల మండలంలో రోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వాగులు, వంకలు పొంగుతుండటంతో జ్వరం వస్తే గూడేల్లోనే మగ్గిపోవాల్సి వస్తోంది. వైద్యం కోసం వాగులు దాటి పీహెచ్‌సీకి వెళ్లినా మందులు లేక.. సరైన వైద్యం అందడం లేదు. 
    504 మలేరియా కేసులు
    జిల్లాలో వందల సంఖ్యలో మలేరియా కేసులు ప్రతి వారం నమోదవుతున్నా.. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తక్కువగా చూపుతున్నారు. ఇప్పటివరకు 504 మలేరియా, 18 డెంగీ కేసులు నమోదైనట్లు పేర్కొంటున్నారు. గత ఏడాది 439 డెంగీ కేసులు నమోదయ్యాయి. అయితే ఏటా ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నా.. లెక్కల్లో మాత్రం అధికారులు తక్కువగా చూపుతుండటం గమనార్హం. డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ పరీక్షలు చేసే పరికరాలు చాలా పీహెచ్‌సీల్లో లేకపోవడంతో నామమాత్రపు సంఖ్యలో నమోదు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పీహెచ్‌సీలకు వచ్చే రోగులకు మొదటి విడత పారాసిటమాల్‌ తదితర ట్యాబ్లెట్లు ఇచ్చి పంపిస్తున్నారు. అయితే జ్వరం ఎంతకూ తగ్గకపోవడంతో మళ్లీ మళ్లీ పీహెచ్‌సీలకు వెళ్తున్నారు. ఆర్థికంగా ఉన్న వారు మాత్రం ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. 
    విషజ్వరాల కేసుల నమోదు ఇలా..
    మలేరియా 504
    డెంగీ 18 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement