
గుత్తా.. ఇక రైతుపాత్ర?
నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నాయకుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి రైతుపాత్ర పోషించపోతున్నారా...
♦ రైతు సమన్వయ సమితిలో సభ్యుడిగా ఎంపీ సుఖేందర్‌రెడ్డి
♦ చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామ కమిటీలో సభ్యుడిగా చేరిక
♦ మండల సమితిలో కూడా ఎంపీ సుఖేందర్‌రెడ్డి పేరు ప్రతిపాదన
♦ కమిటీలకు కార్పొరేషన్ హోదా కల్పిస్తే రాష్ట్ర చైర్మన్‌గా అవకాశం?
♦ సభ్యులుగా చేరేందుకు పోటీపడుతున్న ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు
♦ వివరాలను గోప్యంగా ఉంచుతున్న టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
సాక్షి, ప్రతినిధి, నల్లగొండ : నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నాయకుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి రైతుపాత్ర పోషించపోతున్నారా.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు సమన్వయ సమితిల్లో ఈయన కీలకంగా వ్యవహరించే అవకాశం ఉందా..? అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. ఎంపీ స్వగ్రామం చిట్యాల మండలం ఉరుమడ్ల రెవెన్యూ పంచాయతీలో ఖరారు చేసిన కమిటీలో సభ్యుడిగా ఎంపీ పేరును చేర్చినట్లు సమాచారం. రాష్ట్రస్థాయి సమన్వయ సమితి చైర్మన్‌గా – మిగతా 2లో
మొదటి పేజీ తరువాయి
ఉండాలంటే గ్రామ స్థాయిలో సభ్యుడై ఉండాల్సిందే. దీంతో గుత్తా రాష్ట్ర స్థాయి చైర్మన్‌గా నియమితులవుతారని ప్రచారం జరుగుతోంది. అయితే మండల కమిటీలో కూడా సుఖేందర్‌రెడ్డి పేరును ప్రతిపాదించారు. మొత్తానికి గుత్తాకు రాష్ట్ర సమన్వయ సమితి చైర్మన్‌గా జరుగుతున్న ప్రచారానికి ఆయా విషయాలు మరింత బలం చేకూరుస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లోకి చేరే స మయంలో తాను అధికారికంగా గులాబి తీర్థం పుచ్చుకోపోయినప్పటికీ అనధికారికంగా కేసీఆర్ ప్రభుత్వానికి తన మద్దతు ఉంటుందని గుత్తా అనేక సందర్భాల్లో ప్రకటించారు. ఒక వేళ అధికారికంగా పార్టీ మారాల్సి వస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని కూడా స్పష్టం చేశారు. తాజాగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు సమన్వయ కమిటీల్లో గుత్తా సభ్యుడిగా చేరడం పట్ల ఉమ్మడి జిల్లాలో ఆసక్తికరంగా మారింది. రైతు ఎవరైనా కానీ పార్టీలో చేరొచ్చన్న ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు గుత్తా కమిటీలో చేరినప్పటికీ రాష్ట్ర స్థాయి చైర్మన్‌గా వెళ్లాల్సిన పరిస్థితే వస్తే అప్పుడు ఎంపీ పదవికి రాజీనామా చేయడం అనివార్యం కాకతప్పదని తెలుస్తోంది.
ప్రాదేశిక సభ్యుల పోటీ...
రైతు సమన్వయ కమిటీల్లో సభ్యులుగా ఉండేందుకు ఉమ్మడి జిల్లాల్లో ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు కూడా ఉత్సాహపడుతున్నట్లు తెలిసింది. కాంగ్రెస్, టీడీపీల నుంచి వలసొచ్చిన నాయకుల్లో ప్రముఖులైన వాని పేర్లు సమన్వయ కమిటీల్లో చేర్చుతున్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. గ్రామ, మండల సమన్వయకర్తలుగా కాకపోయిన సభ్యులుగా ఉండేందుకు పోటీపడుతున్నారు. ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు కమిటీల్లో సభ్యులుగా కాకపోయినా గ్రామ, మండల స్థాయి కమిటీలు నిర్వహించే సమావేశాలకు వారు గౌరవ సభ్యులుగా హాజరయ్యేలా ప్రభుత్వం త్వరలో ఒక ప్రకటన చేసే అవకాశం కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గ్రామ, మండల స్థాయి కమిటీల జాబితాలు ఖరారైనప్పటికీ చివరి నిమిషయంలో కొన్ని కీలక మార్పులు జరిగే అవకాశం ఉన్నందున వాటి వివరాలను బయటికి పొక్కనీయ కుండా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు గోప్యంగా ఉంచుతున్నారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు చివరికి రైతు సమన్వయ కమిటీలు అధికార పార్టీ కమిటీలు మారుతాయోమన్న ఆరోపణలకు బలం చేకూర్చేనట్లవుతుందనే వాదన కూడా వినిపిస్తోంది.