హలీంకు గులాం
♦ రుచిని ఆస్వాదిస్తున్న జనం
♦ పెరుగుతున్న విక్రయాలు
♦ మండల కేంద్రాల్లోనూ బట్టీలు
♦ ముస్లింలతో పాటు అన్ని వర్గాలూ ఫిదా
రంజాన్ పవిత్ర మాసంలో ఉపవాస దీక్షల అనంతరం నీరసించిన శరీరానికి తక్షణ శక్తి కోసం తీసుకునే పదార్థమే హలీం. ఈ మాసంలో లభించే ప్రత్యేక ఆహార పదార్థాన్ని ముస్లింలతో పాటు కులమతాలకు అతీతంగా ఇష్టపడి మరీ తింటుంటారు. ప్రాంతాన్ని బట్టి ప్లేటుకు రూ. 70 నుంచి రూ. 80 చొప్పున విక్రయిస్తున్నారు నిర్వాహకులు. గతంలో కేవలం హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైన ఈ హలీం ప్రస్తుతం చిన్నచిన్న పట్టణాల్లోకూడా లభ్యమవుతోంది. - ఘట్‌కేసర్ టౌన్
రంజాన్ ముస్లింలకు పవిత్రమైన మాసం. ఈ నెలలో ముస్లింలు నియమ నిష్టలతో ఉపవాస దీక్షలను చేపడతారు. రంజాన్ మాసంలో మాత్రమే లభించే ప్రత్యేక ఆహార పదార్థం హలీం. సూర్యోదయం నుంచి నియమ నిష్టలతో ఉపవాస దీక్షలను చేపడతారు ముస్లిం సోదరులు. అంటే దాదాపు 12 గంటల పాటు మంచినీరు కూడా ముట్టరు. సాయంత్రం దీక్ష విరమిస్తారు. ఈ సమయంలో తక్షణ శక్తినిచ్చేందుకు, బలమైన పోషకాలు, బలవర్ధకమైన ఆహారం కోసం ముస్లింలు హలీంను ఇష్టంగా తింటారు. ఇందుకు కోసం రంజాన్ మాసం ప్రారంభం నుంచే ప్రధాన కూడళ్లలో హలీం విక్రయ కేంద్రాలు వెలుస్తాయి. సాయంత్రం అయిందంటే చాలు చిన్న, పెద్ద, కుల, మత అన్న తేడా లేకుండా హలీం విక్రయ కేంద్రాల వద్ద క్యూలు క డుతుంటారు. ఖరీదైన దినుసులతో తయారు చేసే బలమైన ఆహారం హలీం. దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన హలీం ఒకప్పుడు హైదరాబాద్‌కే పరిమితమయ్యేది. ప్రస్తుతం మండల కేంద్రాల్లో హలీం బట్టీలు దర్శనమిస్తున్నాయి.
హలీం తయారీ విధానం...
హలీం, హరీస్‌ను తయారు చేయడానికి 8-9 గంటల పడుతుంది. పొట్టేలు మాంసంతో చేసిన హలీంగా, కోడి మాంసంతో తయారుచేసిన హలీంను హరీస్‌గా పిలుస్తారు. హలీం వంటకం తొందరగా జీర్ణమై ఆకలిని పెంచుతుంది. ప్రొటీన్లు, క్యాలరీలు అధికంగా ఇందులో లభిస్తాయి. ముందుగా తాజా కోడి, గొర్రె మాంసాన్ని చిన్నచిన్న ముక్కలుగా చేసి శుభ్రపరిచి ఉడికిస్తారు. అనంతరం గోధుమలు, పిస్తా, బాదం, ఖాజు, డ్రైప్రూట్స్, నెయ్యి, ఫిరంజి, అక్రోట్స్, యాలకులు, సాజీర, దాల్చిన చెక్క, జీడిపప్పు, గరం మసాల తదితర 55 రకాలకు పైగా సుగంధ ద్రవ్యాలను కలిపి హలీంను తయారు చేస్తారు. పెద్దపెద్ద బట్టీలు నిర్మించి పాత్రలో గంటల తరబడి ఉడికించడంతో నోటిలో వేసుకుంటేనే కరిగిపోయే విధంగా తయారవుతుంది. రుచి రావడానికి ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీన, నిమ్మరసాన్ని మెత్తగా తయారు చేసిన హలీంతో కలిపి విక్రయిస్తారు. ప్రాంతాన్ని బట్టి ప్లేటుకు రూ. 70 - 80లకు విక్రయిస్తున్నారు. ఘట్‌కేసర్ మండల కేంద్రంలో హలీం విక్రయలు రోజురోజుకు పెరుగుతున్నాయి.