
అటకెక్కిన చేనేత, టెక్స్‌టైల్ పార్కులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చేనేత, వస్త్ర పార్కుల ఏర్పాటు ప్రక్రియ ఒక అడుగు ముందుకు, ఆరడుగులు వెనక్కి చందంగా సాగుతోంది. పార్కుల్లో ప్లాట్లు పొందిన ఔత్సాహికులు ఆ తర్వాత పనులు ప్రారంభించకపోవడంతో పార్కుల నిర్వహణ ప్రభుత్వానికి భారమవుతోంది. మరోవైపు యూనిట్లు ప్రారంభమైన చోట ప్రభుత్వం నుంచి సాంకేతిక సాయం, మార్కెటింగ్ సహకారం అందడం లేదు. పార్కుల్లో అరకొర సౌకర్యాలను సాకుగా చూపుతూ పెట్టుబడులు పెట్టేందుకు ఔత్సాహికులు ముందుకు రావడం లేదు. చేనేత, వస్త్ర పార్కుల్లో నెలకొన్న సమస్యలపై మంత్రి జూపల్లి తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నా గాడిన పడటం లేదు. పార్కుల్లో ప్రతిపాదనలు పట్టాలెక్కకపోవడంతో నేత కార్మికులకు అండగా నిలవాల్సిన టెక్స్‌టైల్ పార్కులు గుదిబండలా తయారవుతున్నాయి. వివిధ జిల్లాలకు మంజూరైన చేనేత, టెక్స్‌టైల్ పార్కుల్లో ప్రస్తుత పరిస్థితులను ఓసారి పరిశీలిస్తే...
► మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల లో 2006-07లో 50 ఎకరాల ప్రభుత్వ భూమిలో రూ.8.21 కోట్లతో చేనేత పార్కు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే పార్కు అభివృద్ధి పనుల ప్రాథమిక దశలోనే ప్రాజెక్టు నివేదికను మళ్లీ రూపొందించాలనే సాకుతో నిలిపేశారు. అత్యాధునిక సౌకర్యాలతో పార్కును అభివృద్ధి చేసేందుకు రూ. 70 కోట్లు అవసరమవుతాయని తాజాగా అంచనా వేశారు.
► నల్లగొండ జిల్లా మల్కాపూర్‌లో 2003-04లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 3.31 కోట్లతో 50 ఎకరాల్లో పార్కు అభివృద్ధిని ప్రతిపాదించగా అధికారులు ఆ తర్వాత అంచనాలను సవరించి ఇప్పటి వరకు రూ.8.3 కోట్లు ఖర్చు చేశారు. మరో రూ.5 కోట్లు కేటాయిస్తే తప్ప పనులు కొలిక్కి వచ్చేలా లేవు. 110 ప్లాట్లకుగాను 8 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి ప్రారంభించడం గమనార్హం. పనులు ప్రారంభించని వారికి భూ కేటాయింపులు రద్దు చేయాలని మంత్రి జూపల్లి ఇటీవల అధికారులను ఆదేశించారు.
► కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో చేనేత, టెక్స్‌టైల్ పార్కును టీసీఐడీఎస్ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2002-03లో మంజూరు చేశాయి. బద్దెనపల్లిలోని 60 ఎకరాల్లో రూ. 77.33 కోట్లతో పార్కు అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. ఇప్పటి వరకు పార్కు అభివృద్ది కోసం రూ. 9.46 కోట్లు ఖర్చు చేశారు. మురుగు కాల్వలు, అంతర్గత రోడ్లు, ఇతర మౌలిక సౌకర్యాల పనులు ఇంకా పూర్తి కావాల్సి ఉంది. పక్కనే ఉన్న మరో 15 ఎకరాల్లో ప్రతిపాదించిన అభివృద్ధి పనులూ నిలిచిపోయాయి. పార్కులో తీవ్ర నీటి కొరత నెలకొంది.
► మెదక్ జిల్లా పటాన్‌చెరు పాశమైలారంలోనూ టీసీఐడీఎస్ కింద 2002-03లో టెక్స్‌టైల్ పార్కు మంజూరైంది. రూ. 9.03 కోట్లతో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో 50 ఎకరాల్లో పార్కును అభివృద్ధి చేయాలని ప్రతిపాదించినా, 88 ప్లాట్లకు గాను 48 ప్లాట్లలో పునాది కూడా తీయలేదు.
► వరంగల్‌లో 2005-06లో ఏర్పాటు చేయతలపెట్టిన మినీ టెక్స్‌టైల్ పార్కు ప్రతిపాదన కూడా ముందుకు సాగడం లేదు. రూ.12.80 కోట్లతో పార్కును అభివృద్ధి చేయాలని ప్రతిపాదించి, హౌజింగ్ బోర్డు నుంచి భూ సేకరణ కూడా జరిపారు. లే ఔట్ అనుమతులు లభించినా మౌళిక సౌకర్యాల కల్పన ఇంకా ప్రాథమిక దశలోనే వుంది.