గుంత మాటున మృత్యువు
గుంత మాటున మృత్యువు
Published Sun, Jul 31 2016 11:30 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
ఓర్వకల్లు/జూపాడుబంగ్లా:
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం వెరసి శనివారం రాత్రి 18వ జాతీయ రహదారి ఓ పోలీసు ఉద్యోగిని బలితీసుకుంది. మిత్రునితో కలిసి బైక్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు రహదారిపై గుంతలో పడి జూపాడుబంగ్లా హెడ్ కానిస్టేబుల్ మరణించాడు. ఓర్వకల్లు మండలం ఎన్.కొంతలపాడుకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు టీచర్ నాగయ్యకు జయప్రకాష్, దేవానందం (44), సువర్ణ (35), వసుంధర సంతానం. గ్రామంలోనే అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తున్న పెద్ద కుమార్తె సువర్ణ నెల క్రితం గుండెపోటుతో మరణించింది. ప్రస్తుతం చిన్నకుమారుడు దేవానందం రోడ్డు ప్రమాదంలో మత్యువాతపడడంతో ఆ కుటుంబానికి తీరని శోకం మిగిలింది. దేవానందం 1992వ బ్యాచ్‌లో 610 జీఓ కింద హైదరాబాద్‌లో పోలీసు ఉద్యోగం సాధించాడు. కర్నూలు, తుగ్గలి, బనగానపల్లె పోలీసు స్టేషన్లలో విధులు నిర్వర్తించారు. ఏడాది క్రితం హెడ్‌కానిస్టేబుల్‌గా పదోన్నతి పొంది బనగానపల్లె నుంచి ఈ మధ్యకాంలోనే జూపాడుబంగ్లా స్టేషన్‌కు బదిలీ అయ్యాడు. ఓర్వకల్లులో కాపురం ఉంటూ రోజూ విధులకు వెళ్లివచ్చేవారు. ఈ క్రమంలో పెద్ద కూతురు నందిని డిప్లమో ఇన్ అగ్రికల్చర్ కౌన్సెలింగ్ నిమిత్తం మూడు రోజుల క్రితం సెలవుపై వచ్చాడు. శనివారం సాయంత్రం అతనికి సుపరిచితుడైన వ్యక్తిని కలిసేందుకు బైక్‌పై చెన్నంచెట్టిపల్లెకు వెళ్లాడు. సాయంత్రం 6.30 గంటల సమయంలో బైక్‌పై ఇంటికి ఓర్వకల్లుకు బయలుదేరిన దేవానందం కాల్వబుగ్గ–హుసేనాపురం మధ్య బుగ్గరామేశ్వర పాఠశాల సమీపంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా వంతెన నిర్మాణం కోసం తవ్విన గుంతలో పడ్డాడు. తల, ముఖానికి తీవ్ర రక్తగాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు రాత్రి 12 గంటల సమయంలో ఓర్వకల్లు పోలీసులకు సమాచారం వచ్చింది. కర్నూలు సీఐ నాగరాజుయాదవ్, ఎస్‌ఐ చంద్రబాబునాయుడు సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఆదివారం ఉదయం నందికొట్కూరు సీఐ శ్రీనాథ్‌రెడ్డి, బ్రాహ్మణకొట్కూరు, మిడుతూరు, ఉల్లిందకొండ ఎస్‌ఐలు రాజ్‌కుమార్, చంద్రశేఖర్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రావు ఘటనా స్థలానికి వెళ్లి అన్ని కోణాల్లో విచారించారు. చివరకు రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్న కేఎంసీ కంపెనీ ప్రతినిధి రాజశేఖర్‌ను ప్రమాదాలకు బాధ్యున్ని చేసి క్రిమినల్ కేసు నమోదు చేశారు. మతదేహాన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మతునికి భార్య సలోమితోపాటు నందిని, అలేఖ్య, నవీన్ సంతానం.
Advertisement