డీఎడ్ పరీక్షల్లో భారీగా మాస్ కాపీయింగ్
పరీక్ష ప్రారంభమైన కాసేపటికే ప్రశ్నపత్రం బయటకు వచ్చిన వైనం
కిటీకీల్లో నుంచి పరీక్ష హాల్‌లోకి జవాబు పత్రాల పంపిణీ
అంతా పబ్లిక్‌గా జరుగుతున్నా పట్టించుకోని అధికారులు
రాయచోటి రూరల్: రాయచోటి పట్టణంలో నిర్వహిసున్న డీఎడ్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ భారీగా జరుగుతోంది. పరీక్షలు ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగా నిమిషాల వ్యవధిలోనే ప్రశ్నపత్రం బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ తరువాత దానికి సంబంధించిన జవాబు పత్రాలు పరీక్షా కేంద్రాల బయట నుంచి కిటికీ ద్వారా లోపలి విసిరేసేందుకు పలువురు సిద్ధమయ్యారు. రాయచోటి పట్టణంలో డైట్ విద్యా కేంద్రం, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో రెండు చోట్ల మొత్తం 17 గదుల్లో 500 మంది విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద కిటికీల నుంచి కొందరు యువకులు పరీక్షా హాల్‌లోకి జవాబు పత్రాలు నేరుగా వేస్తున్నా అక్కడ ఉన్న సిబ్బంది, అధికారులు నిమ్మకునీరెత్తినట్లు ఉండటం గమనార్హం. ఈ విషయాలపై పరీక్షా కేంద్రాల చీఫ్‌లు దేవరాజులురెడ్డి, రాజేంద్రప్రసాద్‌లను వివరణ కోరగా ప్రశ్నపత్రం ఎలా బయటకు వెళ్లిందో తమకు అంతు పట్టడం లేదన్నారు. మాస్ కాపీయింగ్ జరగకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు.