బాబోయ్‌... చలి! | heavy cold in anantapur district | Sakshi
Sakshi News home page

బాబోయ్‌... చలి!

Published Sun, Dec 25 2016 11:02 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

బాబోయ్‌... చలి! - Sakshi

బాబోయ్‌... చలి!

– వణుకుతున్న 'అనంత'
 - అగళిలో 6.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు
– తగ్గిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు
– అర్ధరాత్రి నుంచే కమ్ముకుంటుంన్న పొగమంచు
– జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు  


అనంతపురం మెడికల్‌ : పల్లె..పట్టణం అన్న తేడా లేకుండా చలిపులికి ‘అనంత’ వణుకుతోంది. చలిగాలులతో వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాత్రి 8 గంటల నుంచే పొగ మంచు కమ్ముకుంటుంటోంది. ఆదివారం కూడా అగళిలో కేవలం 6.9 డిగ్రీలుగా నమోదైంది. మడకశిర 7.6 డిగ్రీలు, కుందుర్పి 9.5 డిగ్రీలు, గుమ్మగట్ట 9.6 డిగ్రీలు, అమరాపురం 9.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.  ఇలాంటి పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, బాలింతలు, వృద్ధులు,. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు అప్రమత్తంగా ఉండాలంటున్నారు. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండేవారిలోనూ చలి వాతావరణం అనారోగ్యాన్ని కలిగిస్తుందని హెచ్చరిస్తున్నారు.

చంటిబిడ్డలకు రక్షణ ఇలా..!
 – చిన్న పిల్లలకు ఉదయం 11 గంటల తర్వాత స్నానం చేయించాలి. చల్లని వాతావరణంలో వేడి నీళ్ల స్నానం చేయించినా బిడ్డను ఇంట్లోకి తీసుకెళ్లేలోపు శరీర ఉష్ణోగత్ర తగ్గిపోతుంది.
– తలకు నూనె, కళ్లకు కాటుక, ఉగ్గుపాలు వంటివి వినియోగించుకూడదు.
– జలుబు చేస్తే నాజిట్‌ డ్రాప్స్‌ మాత్రమే వినియోగించాలి. సిట్రజిన్‌ సిరప్‌ వాడొచ్చు. దోమ తెరలను తప్పనిసరిగా వాడాలి.
– చిన్న బిడ్డలు ఉన్న చోట పొగ తాగకూడదు.
– తలస్నానం చేయించాక సాంబ్రాణి పొగ వేయకూడదు. అలా చేయడం వల్ల శ్వాసకోస వ్యాధులు సంక్రమిస్తాయి.
– పుట్టిన బిడ్డలకు బొడ్డు ఊడలేదనే అపోహతో రుద్దడం చేయకూడదు. అక్కడ తడి ఉంటే పొడిగుడ్డతో అద్దడం మాత్రమే చేయాలి.
– డైపర్స్‌ వాడిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. లేదంటే బ్యాక్టీరియా వ్యాపించి శరీరంపై దద్దుర్లు వస్తాయి.
– గర్భిణులు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మూడు నెలల లోపల ఏ విధమైన మాత్రలు వినియోగించకూడదు. అర కిలో మీటర్‌ వరకు నడవచ్చు. జలుబు, దగ్గు వస్తే తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి.

'పెద్ద'లను కాపాడుకుందామిలా..!
– 60 ఏళ్ల పైబడిన వృద్ధులు చలి వాతావరణంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం 5 గంటల నుంచి ఆరు గంటల మధ్య నడకకు వెళ్లడాన్ని మానుకోవాలి. ఆరు గంటల నుంచి 7 గంటల మధ్య మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే తలకు మంకీ క్యాప్, ఉన్ని వస్త్రాన్ని చెవులు, ముక్కుతో పాటు తలకు చుట్టుకోవడం మంచిది. ముక్కులకు మంచు గాలి తగలకుండా జాగ్రత్త పడాలి. ఫుల్‌ హ్యాండ్‌ దుస్తులు, చేతికి గ్లౌజులు వాడాలి.
– గృహిణులు మంచు సమయంలో ఇంటి కిటికీలను మూసివేయాలి.
– కూల్‌డ్రింక్స్‌ జోలికి వెళ్లకపోవడం మంచిది. పండ్ల రసాలు తీసుకోవడం ఉత్తమం.
– గోరు వెచ్చని నీరు, తేనె, నిమ్మరసం కలుపుకుని ఉదయాన్నే తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
– గ్రీన్‌ టీ మేలు చేస్తుంది. రోజుకు మూడు, నాలుగు సార్లు తాగొచ్చు
– గుండె సంబంధిత వ్యాధులు, ఉబ్బసం, నెమ్ము లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు ఉదయం 8 గంటల వరకు బయటకు వెళ్లకపోవడం ఉత్తమం.
– ఏసీలు వినియోగించే వారు చలి తీవ్రత తగ్గే వరకు నిలిపివేయడం మంచిది

తల్లి పొత్తిళ్లే 'పురిటి బిడ్డ'కు మేలు :
పురుటి బిడ్డల (28 రోజుల వయసున్న వారు) విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ప్రసవమైన వెంటనే నెలలు తక్కువగా పుట్టిన బిడ్డలైతే చలి తగలకుండా చూసుకోవాలి. వెచ్చదనాన్ని కలిగించే ఇంక్యుబేటర్లలో ఉంచితే ఉష్ణోగ్రత సమానంగా ఉంటుంది. తల్లీబిడ్డ విడివిడిగా పడుకోకూడదు. తల్లి పొత్తిళ్లలో బిడ్డ ఉంటే ఉష్ణోగ్రత సమానంగా ఉంటుంది. పుట్టిన బిడ్డ బరువు 2500 గ్రాములు ఉండాలి. శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెంటీగ్రేడ్‌గా ఉండాలి. తల్లులు బలవర్ధకమైన పాలు, గుడ్డు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. కాల్షియం తగ్గితే అనారోగ్య సమస్యలు వస్తాయి. బాలింతలకు కారం కలిపిన అన్నం..కరివేపాకు పొడిని కలిపిన భోజనాన్ని తినిపించాలన్నది అపోహ మాత్రమే. దీని వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి నీరసపడతారు. ప్రతి ఒక్కరికీ రోజుకు 2500 క్యాలరీల ఆహారం అవసరం. గర్భిణులైతే 2800 క్యాలరీలు, బాలింతలైతే మూడు వేల క్యాలరీల భోజనం అవసరం. మునగాకుతో చేసిన కూరలు, క్యారెట్, పాలకూర, బంగాళా దుంపల్లో తగినంత కాల్షియం ఉంటుంది.

హైపోథెర్మియాతో ప్రాణాపాయం :
చలి ప్రభావం వల్ల పురిటి పిల్లలు హైపోథెర్మియా బారిన పడి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. జలుబు, తుమ్ములు, ఆస్తమా ఉంటే తక్షణం వైద్యులను సంప్రదించాలి. పిల్లలకు శరీరమంతా కప్పి ఉంచేలా దుస్తులు వేయాలి. ఆస్తమా బాధితులు మాస్క్‌లు కట్టుకోవాలి. స్కూల్‌కు వెళ్లే చిన్నారులు స్వెట్టర్లు వాడాలి. బయటి తిండికి దూరంగా ఉంటే మంచిది. వీలైనంత వరకు వెచ్చదనం ఉండేలా చూసుకోవాలి.

దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్న పెద్దలకు చలి వాతావరణం ఇబ్బంది కలిగిస్తుంది. రక్త నాళాలు చలికి కుంచించుకుపోయి గుండె జబ్బులు ఉంటే త్వరగా ఉండె పోటు వచ్చే అవకాశం ఉంది. నిమోనియా, గొంతు సంబంధిత ఇన్‌ఫెక్షన్లు వస్తాయి.  
– డాక్టర్‌ హరిప్రసాద్, పీడియాట్రిక్‌ సర్జన్, చిన్నారి హాస్పిటల్, అనంతపురం.

వారం రోజులుగా ఉష్ణోగ్రత వివరాలు  
తేదీ            కనిష్ట ఉష్ణోగ్రత
డిసెంబర్‌ 19        16.4
డిసెంబర్‌ 20        16.6
డిసెంబర్‌ 21        16.0
డిసెంబర్‌ 22        14.5
డిసెంబర్‌ 23        12.7
డిసెంబర్‌ 24        13.1
డిసెంబర్‌ 25        13.0

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement