కొండపోత వాన.. | Heavy rains | Sakshi
Sakshi News home page

కొండపోత వాన..

Nov 10 2015 1:08 AM | Updated on Sep 3 2017 12:17 PM

కొండపోత వాన..

కొండపోత వాన..

దక్షిణ కోస్తా రైతన్నను వణికించిన వాయుగుండం ఎట్టకేలకు తీరందాటింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం తుపానుగా మారకముందే బలహీనపడింది.

♦ పుదుచ్చేరి వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం
♦ బలహీనపడిన రోవాన్
♦ తిరుమలలో విరిగిపడిన కొండచరియలు
♦ దక్షిణ కోస్తా, రాయలసీమల్లో మరో 24 గంటలు వర్షాలు
 
 సాక్షి, నెట్‌వర్క్: దక్షిణ కోస్తా రైతన్నను వణికించిన వాయుగుండం ఎట్టకేలకు తీరందాటింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం తుపానుగా మారకముందే బలహీనపడింది. ఇది ఉత్తర దిశగా పయనిస్తూ సోమవారం రాత్రి 7.30 గంటల సమయంలో పుదుచ్చేరికి సమీపంలో తీరాన్ని దాటింది. దీని ప్రభావానికి నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురవగా, కృష్ణా, ప్రకాశంతోపాటు దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు కురిశాయి.వరి, పత్తి, టమోటా, కంది పంటలు దెబ్బతిన్నాయి. చెన్నైతోపాటు నాలుగు జిల్లాలు వర్షాలకు అతలాకుతలమయ్యాయి.

 అంచనాలకు అందని రోవాన్
 బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారుతుందని, సోమవారం అర్థరాత్రి తీరం దాటుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండి) ఆదివారం అంచనా వేసింది. అయితే సోమవారం మధ్యాహ్నానికే పుదుచ్చేరి వద్ద దాటవచ్చని అంచనాకు వచ్చింది. ఆదివారం గంటకు 15 కిలోమీటర్ల వేగంతో పయనించిన వాయుగుండం సోమవారం తీవ్ర వాయుగుండగా బలపడ్డాక వేగాన్ని 7 కిలోమీటర్లకు తగ్గించుకుంది. దీంతో ఆ అంచనాలకు భిన్నంగా రాత్రి వరకూ వాయుగుండం తీరం దాటకుండా సముద్రంలోనే స్థిరంగా కొనసాగుతూ వచ్చింది. ఇది వాతావరణ అధికారులను కూడా గందరగోళంలోకి నెట్టింది.  మరోవైపు రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. అదేసమయంలో కోస్తాంధ్రలోని కృష్ణా, గుంటూరు,ప్రకాశం, నెల్లూరు, రాయలసీమలోని చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురవవచ్చని పేర్కొంది.  

 తమిళనాడులో ఆరుగురి మృతి
 ఈశాన్య రుతు పవనాలు, వాయుగుండం ప్రభావంతో తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. సోమవారం  వర్షాలకు ఆరుగురు బలయ్యారు.
 
 తిరుమల రెండో ఘాట్‌లో కూలిన  కొండచరియలు
 సాక్షి,తిరుమల: బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా తిరుమలలో కురుస్తున్న భారీ వర్షాలకు తిరుపతి నుంచి తిరుమల వెళ్లే రెండో ఘాట్‌రోడ్డులో పెద్ద ఎత్తున కొండ చరియలు విరిగిపడ్డాయి. ఫలితంగా మూడుకిలోమీటర్ల మేర రోడ్డు మార్గాన్ని మూసివేసి వాహనాలు రెండో ఘాట్ ద్వారా తిరుమలకు మళ్లించారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సోమవారం రాత్రి 10 గంటల నుంచి మంగళవారం తెల్లవారుజామున 5 గంటల వరకు రెండో ఘాట్‌రోడ్డు మూసివేయాలని టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు ఇంజనీర్లను ఆదేశించారు. 14వ కిలోమీటరు వద్ద చైన్‌లింక్ కంచె నిర్మించిన ప్రాంతంలో సుమారు వంద టన్నుల రాళ్లు కుప్పకూలడంతో పైభాగంలోని రోడ్డు కూడా ప్రమాదకర పరిస్థితికి చేరింది. ఇంజనీర్లు వెంటనే రాళ్లను తొలగించే పనులు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement