వరుణార్పణం..
వరుణార్పణం..
Published Mon, Aug 1 2016 5:05 PM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM
నిండా ముంచిన వర్షం..
నీట మునిగిన వేరుశనగ పంట
ఎకరాకు రూ .50 వేలు పెట్టుబడి
10 శాతం కూడా చేతికి రాని పరిస్థితి
ప్రభుత్వం ఆదుకోవాలని వినతులు
రేపల్లె : ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతి కందే తరుణంలో వర్షార్పణమవడంతో రైతులకు కన్నీటిని మిగిల్చింది. రెక్కల కష్టం వృధాగా మారి నష్టాలను మిగిల్చాయి. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో ఖరీప్ సాగుకు సిద్ధపడుతున్న రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తుంటే, మరోవైపు వేసవిలో వేరుశనగ సాగు చేసిన రైతులకు విషాదాన్ని మిగిల్చింది. నియోజకవర్గంలోని చెరుకుపల్లి మండలం రాంబోట్లవారిపాలెం, తుమ్మలపాలెం, కావూరు గ్రామ పంచాయతీల పరిధిలో సుమారు 500 ఎకరాల్లో వేసవిలో వేరుశనగ సాగు చేశారు. రెండేళ్లుగా ఖరీప్‌లో వరి సాగు ఆగస్టు చివరి మాసంలో ప్రారంభమవుతుండటంతో ఈ ప్రాంత రైతులు మే నెలలో వేరుశనగ సాగుకు శ్రీకారం చుట్టారు. అప్పుడు సాగు చేసిన పంట ప్రస్తుతం చేతికందే సమయంలో ఉంది. ఈ తరుణంలో రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు రాంబోట్లవారిపాలెం పంచాయతీ పరిధిలో సుమారు 200 ఎకరాల పంట నీటమునగటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో 20 రోజుల్లో కోతకు వస్తున్న సమయంలో కురిసిన వర్షాలకు మళ్లలో నీళ్లు చేరి కుళ్లిపోయే దశకు చేరుకున్నది.
పంటను రక్షించుకునేందుకు రైతుల ప్రయత్నాలు..
వర్షాలకు కుళ్లిపోతున్న పంటను రక్షించుకునేందుకు రైతులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. నీటిలో నానుతున్న వేరుశనగను పెకలించి వాహనాల్లో ఒడ్డుకు చేర్చి బాగున్న కాయలను వేరు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కనీసం 10వ శాతం కూడా చేతికందని పరిస్థితి నెలకొనడంతో రైతులు దిగాలు పడుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
Advertisement