రేపటి నుంచి హెల్మెట్ తప్పనిసరి
ఒంగోలు: రాష్ట్ర వ్యాప్తంగా ద్విచక్రవాహన చోదకులు ఈ నెల 12వ తేదీ నుంచి తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు స్పష్టం చేశారు. తన నివాసంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మోటారు వాహనాల ప్రమాదాల్లో ప్రాణనష్ట నివారణ కోసం ఈ నెల 1 నుంచి తప్పరిసరిగా హెల్మెట్ ధరించాలని ఆదేశించామన్నారు. దీనిపై ప్రజలకు మరింత అవగాహన కల్పించి వచ్చే ఏడాది జనవరి 1 నుంచి హెల్మెట్ తప్పనిసరి చేసేందుకు నిర్ణయం తీసుకోగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 12 నుంచే హెల్మెట్ తప్పనిసరి చేసినట్లు వివరించారు. అందువల్ల ప్రతి ఒక్క ద్విచక్ర వాహన చోదకుడూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.
త్వరలో రామాయపట్నం పోర్టు పనులు..: ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రకాశం జిల్లాలో రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. జిల్లాలో మరమ్మతులకు గురైన తుపాను షెల్టర్లను కేంద్ర ప్రభుత్వ నిధులతో బాగుచేస్తామన్నారు. వెంటనే అత్యవసర మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించామన్నారు. తుపాను నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి నష్టం చోటుచేసుకోలేదన్నారు.