ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారు | hindupur council meet | Sakshi
Sakshi News home page

ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారు

Published Sat, Jul 30 2016 11:00 PM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM

ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారు

ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారు

వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌పై దాడికి యత్నించడం దారుణం
టీడీపీ కౌన్సిలర్లపై ప్రతిపక్ష నాయకుడు శివ ధ్వజం


హిందూపురం అర్బన్‌ : కౌన్సిల్‌ సభలో ప్రతిపక్షాల మాటలకు నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ గొంతులు నొక్కేస్తున్నారని ప్రతిపక్ష నాయకుడు శివ ధ్వజమెత్తారు. కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేతకు మాట్లాడే హక్కు ఉంటుందని చెబుతున్న వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ రహెమాన్‌పై తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు చుట్టుముట్టి ముప్పేట దాడికి యత్నించడం దారుణమన్నారు. శనివారం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లక్ష్మి అధ్యక్షతన, ఇన్‌చార్జ్‌ కమిషనర్‌ రమేష్‌ ఆధ్వర్యంలో కౌన్సిల్‌ సర్వసభ్య సమావేశం జరిగింది.

సభలో ప్రతిపక్ష నేత శివ మాట్లాడుతూ ‘గతంలో నీరు – చెట్టు కార్యక్రమం కింద వేలాది మొక్కలు నాటారు. అందులో సగం కూడా పెరగలేదు. ఇప్పుడు వనం – మనం అని తిరిగి మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నారు. ఫొటోల కోసం కాకుండా బాధ్యతగా నాటి వాటిని పరిరక్షించాలి’ అన్నారు. ఇంతలోనే చైర్‌పర్సన్‌ లక్ష్మి అడ్డుకున్నారు. మొక్కలు పెంచడం వృథా అంటున్నారా? గతంలో డయల్‌ యువర్‌ చైర్‌పర్సన్‌ కార్యక్రమం కూడా సొంత ఇమేజ్‌ కోసం అన్నార ని మండిపడ్డారు. దీంతో టీడీపీ కౌన్సిలర్లు శివను మాట్లాడకుండా విరుచుకుపడ్డారు.

మొక్కల పెంపకంపై బాధ్యత ఉండాలని చెబుతుంటే ఏదేదో ఊహించుకుంటున్నారని శివ వాపోయారు. దీంతో టీడీపీ, వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అంతకుముందు జనన సర్టిఫికెట్లు పొందటంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నార ని దీనిపై స్పష్టత ఇవ్వాలని కౌన్సిలర్‌ శివ కోరగా.. సీపీఐ కౌన్సిలర్‌ దాదాపీర్‌  కూడా మాట్లాడారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో సిజేరియన్‌ ఆపరేషన్లు చేసి నార్మల్‌ డెలివరీ అయినట్టు రాసిస్తూ ఆస్పత్రుల నిర్వాహకులు ఐటీ ఎగవేత చేస్తున్నార ని ఆరోపించారు. అలాంటి వాటిపై నిఘా ఉంచి సక్రమంగా నమోదులు చేయాలన్నారు.

‘నువ్వు నీ వార్డు గురించే మాట్లాడు..
చాలా వార్డులో సరైన రోడ్లు, డ్రైన్లు లేకపోవడంతో వర్షపునీరు చేరి ముంపునకు గురవుతున్నారని శివ తెలిపారు. ఇంతలో చైర్‌పర్సన్‌ కల్పించుకుని నువ్వు (శివ) నీ వార్డు గురించే మాట్లాడు అన్నారు. ఇంతలోనే వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ రహెమాన్‌ మాట్లాడుతూ శివకు మాట్లాడే హక్కు ఉందన్నారు. అప్పుడు వైస్‌చైర్మన్‌ రాము కుర్చోమని గట్టిగా చెప్పడంతో రెహమాన్‌ నువ్వు మధ్యలో మాట్లాడద్దన్నారు. దీంతో టీడీపీ కౌన్సిలర్లు ఒక్కసారిగా లేచి రెహమాన్‌ను చుట్టుముట్టారు. ఒక దశలో దాడి చేసే విధంగా ప్రవర్తించారు. ఇంతలోనే చైర్‌పర్సన్‌ సమావేశాన్ని అర్ధంతరంగా ముగించివేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement