ఆయన తీరేం బాగోలేదు!
ఆయన తీరేం బాగోలేదు!
Published Mon, Oct 3 2016 11:22 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
కలెక్టర్‌కు వ్యతిరేకంగా ఏకమైన జిల్లా అధికారులు
– పని ఒత్తిడి తగ్గించాలని వినతిపత్రం ఇచ్చేందుకు నిర్ణయం
– వైఎస్సార్ కడప జిల్లాకు బదిలీపై వెళ్లాలని డీఆర్‌ఓ ప్రయత్నాలు?
– ఇప్పటికే బదిలీపై వెళ్లిన పలువురు అధికారులు
– ఉన్నోళ్లు ఒత్తిళ్లతో సతమతం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లా కలెక్టర్ తీరుకు వ్యతిరేకంగా జిల్లా ఉన్నతాధికారులంతా ఏకమయ్యారు. తమతో వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లా ఉన్నతాధికారుల సంఘం ఆధ్వర్యంలో అధికారులంతా ప్రభుత్వ అతిథిగృహంలో సోమవారం సమావేశమయ్యారు. తాము కష్టపడి పనిచేస్తున్నప్పటికీ ఏదో ఒక విషయంలో బోనులో నిలబెట్టి దోషులను చేయడం సరికాదని జిల్లా ఉన్నతాధికారులు ఈ సమావేశంలో అభిప్రాయపడినట్టు సమాచారం. పని ఒత్తిడి తగ్గించడంతో పాటు తమతో వ్యవహరిస్తున్న తీరు సరిగాలేదని పేర్కొంటూ నేరుగా ఒకటి, రెండు రోజుల్లో కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించాలని ఈ సమావేశంలో నిర్ణయించుకున్నట్టు తెలిసింది. అదేవిధంగా తమకు ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని కూడా ఈ వినతిపత్రంలో అధికారులు విన్నవించనున్నట్టు సమాచారం. మరోవైపు గాంధీ జయంతి సందర్భంగా డీఆర్‌ఓపై కలెక్టర్ మండిపడిన నేపథ్యంలో ఆయన బదిలీపై వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. వైఎస్సార్ కడప జిల్లాకు వెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్టు సమాచారం.
అందిరీతోనూ అదే తీరు..
గాంధీ జయంత్రి సందర్భంగా డీఆర్‌ఓ విషయంలో జరిగిన గొడవ విషయాన్ని ఒకరిద్దరు సభ్యులు సమావేశంలో లేవనెత్తారు. అయితే, కేవలం తన ఒక్కడి విషయంలో చర్చించడం సరికాదని.. అందరి విషయాల గురించి చర్చిస్తే బాగుంటుందని డీఆర్‌ఓ పేర్కొన్నట్టు తెలిసింది. వాస్తవంగా కలెక్టర్ కేవలం ఒక్కరి పట్ల వ్యవహరిస్తున్న తీరు కాదని.. జిల్లా అధికారులు అందరినీ వేదిస్తున్నారని, అందరూ ఇబ్బందులు పడుతున్నట్టు మరికొందరు అధికారులు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో పని ఒత్తిడి పెరిగిపోతోందని.. కుటుంబ జీవితాన్ని కూడా కోల్పోవాల్సి వస్తోందని వాపోయారు. అదేవిధంగా తీవ్రమైన ఒత్తిడితో జబ్బులు కూడా వస్తున్నాయని మరికొందరు ఉన్నతాధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో పని ఒత్తిడిని తగ్గించాలని కలెక్టర్‌ను కలిసి విన్నవించాలని నిర్ణయించారు.
బదిలీలకు క్యూ
కలెక్టర్ వ్యవహరిస్తున్న తీరుతో అనేక మంది జిల్లా అధికారులు ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లిపోయారు. ఇప్పటికే గతంలో సర్వశిక్షా అభియాన్(ఎస్‌ఎస్‌ఏ) పీఓగా ఉన్న మురళీధర్‌రావుతో పాటు డీఎంఅండ్‌హెచ్‌వోగా పనిచేసిన నరసింహులు, నిరుపమలు బదిలీ చేయించుకున్నారు. వ్యవసాయశాఖ జేడీఏగా ఉన్న ఠాగూర్ నాయక్ వైఎస్సార్ జిల్లాకు వెళ్లిపోయారు. ఏపీఎంఐపీ పీడీ దేవముని రెడ్డి పనితీరు సరిగాలేదని బదిలీ చేయాలని కలెక్టర్ కోరడంతో ఆయన కూడా బదిలీపై వెళ్లిపోయారు. డీఆర్‌డీఏ అదనపు పీడీగా ఉన్న రజియాబేగం ఏకంగా కలెక్టర్ ఎదుటే తాను పనిచేయలేనంటూ బదిలీ చేయించుకున్నారు. సర్వే డిపార్టుమెంటుకు చెందిన గురునాథబాబును సరెండర్ చేశారు. తాజాగా ఇదే బాటలో డీఆర్‌ఓ కూడా వైఎస్సార్ కడప జిల్లాకు బదిలీపై వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. మొత్తంగా కలెక్టర్ బాధిత అధికారుల జాబితా రోజురోజుకూ పెరుగుతోంది.
Advertisement
Advertisement