‘ఎత్తి’పోతలేనా! | Hopes .. games | Sakshi
Sakshi News home page

‘ఎత్తి’పోతలేనా!

Published Mon, Sep 18 2017 11:03 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

‘ఎత్తి’పోతలేనా! - Sakshi

‘ఎత్తి’పోతలేనా!

  • ఆశలు.. ఆటలు
  • మల్యాల నుంచి హంద్రీనీవాకు మొదలైన కృష్ణాజలాల ఎత్తిపోతలు
  • 2వేల క్యూసెక్కులు పంపింగ్‌.. నేటి సాయంత్రానికి జీడిపల్లికి చేరిక
  • ఆ తర్వాత గొల్లపల్లికి పరుగులిడనున్న కృష్ణమ్మ
  • గతేడాది 26 టీఎంసీలు వచ్చినా ఆయకట్టుకు నీరివ్వని వైనం
  •  ఏడాది కూడా పూర్తికాని డిస్ట్రిబ్యూటరీలు
  • వ్యవసాయానికి నీరు అందడం కష్టమే
  •  
    కరువు సీమను సస్యశ్యామలం చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. కళ్లెదుటే నీళ్లున్నా.. ఒక్క ఎకరాను కూడా తడపలేని పరిస్థితి చూస్తే రైతులపై చంద్రబాబు సర్కారుకున్న ప్రేమ ఇట్టే అర్థమవుతుంది. చెరువులను నింపే పేరిట ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తుండటంతో విలువైన జలం వృథా అవుతోంది. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నా.. చుక్క నీరు అందించకపోవడంతో అనంత రైతు కంట్లో కన్నీరు ఉబుకుతోంది. రెండేళ్లుగా ఇదే తంతు.
     
     
                                 హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా 2015లో 16.9 టీఎంసీలు ఎత్తిపోశారు. ఇందులో జిల్లాకు 14 టీఎంసీలు చేరగా.. ఈ నీటితో 1.40లక్షల ఎకరాలకు సాగునీరు అందించే వీలుంది. అయితే ప్రధాన కాలువ పూర్తయినా.. డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ పూర్తికాకపోవడం, అధికారులు ప్రణాళిక లేకుండా వ్యవహరించడంతో జలాలన్నీ వృథా అయ్యాయి. గతేడాది 32 టీఎంసీలు ఎత్తిపోస్తే అందులో 26 టీఎంసీలు ‘అనంత’కు చేరాయి. ఈ నీటిని వరిసాగుకు వినియోగించినా 2.60 లక్షల ఎకరాలకు అందించొచ్చు. ఆరుతడి పంటలకైతే 3.5 నుంచి 4లక్షల ఎకరాలకు నీరు పారించే అవకాశం ఉంది. గతేడాది కూడా ఒక్క ఎకరాకు నీరివ్వలేదు. హంద్రీనీవా ఆయకట్టుకు నీరిస్తామని మూడేళ్లుగా మంత్రులు, అధికారులు చేస్తున్న ప్రకటనలు కార్యరూపం దాల్చని పరిస్థితి. హంద్రీనీవాను ప్రత్యేక సాగునీరు వనరుగా భావించకుండా హెచ్చెల్సీకి ఉపకాలువగా ప్రభుత్వం భావిస్తున్నట్లు కన్పిస్తోంది. అందుకే ఈ నీటిని హెచ్చెల్సీలో కలిపేస్తున్నారు. అది కూడా ప్రణాళికాబద్ధంగాగా ఆయకట్టుకు అందించకపోవడం గమనార్హం. చెరువులకు నింపుతున్నట్లు ప్రకటిస్తూ మొత్తం నీటిని వృథా చేశారు.
     
    వృథా ఇలా:
    మల్యాల వద్ద 32 టీఎంసీలను ఎత్తిపోస్తే, అందులో 26 టీఎంసీలు జిల్లాకు చేరాయి. రాగులపాడు లిఫ్ట్‌ వద్ద 24 టీఎంసీలు వచ్చినట్లు అధికారులు లెక్కతేల్చారు. అంటే మల్యాల నుంచి రాగులపాడుకు 2 టీఎంసీలు నష్టం కింద లెక్కగట్టారు. తక్కిన నీటిలో 14 టీఎంసీలను పీఏబీఆర్‌కు పంపగా.. 2.5 టీఎంసీలను ఫేజ్‌–2లోని గొల్లపల్లి రిజర్వాయర్‌కు తరలించారు. పీఏబీఆర్‌ నుంచి ఎంపీఆర్‌కు, అటు నుండి సీబీఆర్, చెరువులకు నింపినట్లు అధికారులు  చెబుతున్నారు. ఫేజ్‌–2లోని 2.5 టీఎంసీలతో గొల్లపల్లి రిజర్వాయర్‌ను నింపారు. అంటే  26 టీఎంసీలలో 16.5 టీఎంసీలు మినహా తక్కిన నీటిని నష్టాల కింద(ఆవిరి, భూగర్భజలాలుగా ఇంకిపోవడం) చూపుతున్నారు. ఫేజ్‌–1లో హెచ్చెల్సీ కింద కూడా ఆయకట్టుకు నీరివ్వలేదు. నీటి కోసం శింగనమల రైతులు గతేడాది రెన్నెల్ల పాటు అలుపెరుగని ఉద్యమం చేశారు. నీరు అందుబాటులో ఉన్నా ప్రభుత్వం అందించలేకపోయింది. ప్రణాళిక లేకుండా వ్యవహరించడం, డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేయకపోవడమే ఈ పరిస్థితికి కారణమైంది.
     
    ఈ ఏడాదైనా ఆయకట్టుకు నీరందేనా?
    హంద్రీనీవా డిస్ట్రిబ్యూటరీలు పూర్తి కాలేదు. ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూరు మండలం 33, 34 ప్యాకేజీలు డిస్ట్రిబ్యూటరీ పనులు మొదలైనా పూర్తి కాలేదు. దీంతో హంద్రీనీవా ఆయకట్టుకు నీరివ్వడం అసాధ్యం. ఈ నీటిని పీఏబీఆర్‌ ద్వారా హెచ్చెల్సీకి మళ్లించడం అనివార్యం. హెచ్చెల్సీ ద్వారా అయినా ఆయకట్టుకు ఇస్తారా? లేదా? అనేది వేచి చూడాలి. తుంగభద్ర డ్యాంలో ఇన్‌ఫ్లో ఆశాజనకంగా లేదని కేవలం తాగునీటికి మాత్రమే కేటాయింపులు చేశారు. హెచ్చెల్సీ కింద పంటలకు నీరివ్వలేమని అధికారులు చెప్పారు. ఈక్రమంలో హంద్రీనీవా నీటిని హెచ్చెల్సీ కింద పొలాలకైనా మళ్లించి పంటలు కాపాడితే ఉపయోగకరంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
     
    ఇన్‌ఫ్లో ఆశాజనకంగా ఉంటే 40 టీఎంసీలు వచ్చే అవకాశం
    శ్రీశైలానికి ప్రస్తుతం 1.90లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. పదిరోజుల పాటు ఇదే ఇన్‌ఫ్లో కొనసాగితే డ్యాం పూర్తిగా నిండి కళకళలాడుతుంది. హంద్రీనీవా ద్వారా 836 అడుగుల వరకూ మనం నీటిని తీసుకునే అవకాశం ఉంది. గతేడాది 32 టీఎంసీలు ఎత్తిపోశారు. ఈ ఏడాది ఇన్‌ఫ్లో ఆశాజనకంగా ఉంటే 40 టీఎంసీల వరకూ డ్రా చేసే అవకాశం ఉన్నట్లు అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది. ఇందులో అనంతకు కనీసం 33–35 టీఎంసీలు చేరే అవకాశం ఉంది. ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోసేందుకు రూ.12కోట్ల కరెంటు బిల్లు వస్తుంది. ఈ లెక్కన 40 టీఎంసీలు ఎత్తిపోస్తే రూ.480 కోట్లు కరెంటు బిల్లు రూపంలో ఖర్చవుతుంది. ఈ  ఖర్చును చూస్తే ‘అనంత’కు వచ్చే కృష్ణాజలాలు ఎంత విలువైనవో ఇట్టే తెలుస్తుంది. ఇలాంటి జలాలను గత మూడేళ్లుగా ప్రణాళిక లేకుండా ఎవరికి అధికార, అంగ బలం ఉంటే వారు చెప్పినట్లు అధికారులు విడుదల చేస్తున్నారు. రైతుల శ్రేయస్సును ఆలోచించడం లేదు. ఈ క్రమంలో ఈ ఏడాదైనా ప్రణాళికతో వ్యవహరించి కొద్దిమేరకైనా ఆయకట్టును కాపాడాలని రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.
     
    తాగునీటికే ప్రాధాన్యత
    మల్యాలలో 2వేల క్యూసెక్కులు ఎత్తిపోస్తున్నారు. మంగళవారం సాయంత్రం నాటికి జీడిపల్లికి చేరుకుంటాయి. తాగునీటికి మొదటి ప్రాధాన్యత ఇస్తాం. తర్వాత జీడిపల్లిని నింపి గొల్లపల్లికి తరలిస్తాం. పుష్కలంగా నీరొస్తే చెరువులకు అందిస్తాం. ఆపై ఆయకట్టుకు నీరిందించే విషయాన్ని ఆలోచిస్తాం.
    - జలంధర్, సీఈ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement