రేణిగుంట నుంచి పాదయాత్రగా వస్తున్న రేణిగుంట వాసులు
ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు ఉద్యమం
Published Fri, Sep 9 2016 8:54 PM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM
– తిరుపతి సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద రేణిగుంట వాసులు ధర్నా
తిరుపతి మంగళం : ఏళ్ల తరబడి రేణిగుంటలో నివాసముంటున్నా తలదాచుకోవడానికి గూడు లేదని రేణిగుంట వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు ఉద్యమాలు ఆగవని వారు హెచ్చరించారు. ఇంటిస్థల పోరాట కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం రేణిగుంట నుంచి పాదయాత్రగా తిరుపతి సబ్‌కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని ధర్నా నిర్వహించారు. సీపీఎం మండల కార్యదర్శి వెంకటరమణ మాట్లాడుతూ రేణిగుంటలో సుమారు 1,500 మంది పేదలు ఇళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రేణిగుంట మండలంలో వందల ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయని, అందులో పేదలకు ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే అనేక సార్లు ఇంటి స్థలాలపై ధర్నాలు, నిరాహార దీక్షలు చేపట్టినా ప్రభుత్వంలో ఎలాంటి చలనం రాలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పేదల పట్ల ప్రభుత్వానికి ఇంత చిన్నచూపా..? అని మండిపడ్డారు. సంబంధిత అధికారులు స్పందించి రేణిగుంటలోని పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.
Advertisement