పునరావాసం కల్పించాకే ఇళ్లు తొలగించాలి
పునరావాసం కల్పించాకే ఇళ్లు తొలగించాలి
Published Wed, Nov 9 2016 1:37 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): పేదలకు పునరావాసాన్ని పూర్తిగా కల్పించిన తర్వాతే ఇళ్ల తొలగింపును చేపట్టాలని నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్ అనిల్‌కుమార్‌యాదవ్ పేర్కొన్నారు. 53వ డివిజన్ సాలుచింతలలో మంగళవారం పర్యటించిన ఆయన మాట్లాడారు. నాలుగు లేన్ల రోడ్డు మంజూరు కారణంగా ఇళ్లను తొలగించాలని నోటీసులు జారీ చేశారని చెప్పారు. నగరానికి సంబంధించి 67 ఇళ్లు, పోతిరెడ్డిపాళెం పంచాయతీకి సంబంధించి 150 ఇళ్లను తొలగించేందుకు నోటీసులను జారీ చేశారన్నారు. పోతిరెడ్డిపాళెం పరిధిలోని వారికి కోవూరు పంచాయతీకి సంబంధించిన స్థలాల్లో ఇళ్లు ఇస్తారని చెప్పారని, నగరానికి సంబంధించిన వారికి ఎక్కడ పునరావాసం కల్పిస్తారో తెలియక ప్రజలు ఆందోళనకు గురవుతున్నారన్నారు. నగరంలోని 67 ఇళ్లకు సంబంధించిన వారికి ఒకటిన్నర ఎకరా సరిపోతుందని, పాలిటెక్నిక్ కళాశాల వద్ద ప్రభుత్వానికి సంబంధించిన సుమారు ఆరేడు ఎకరాల స్థలం ఉందని, అధికారులు ఇక్కడి స్థలాన్ని సర్వే చేయించి వీరికి కేటాయిస్తే బాగుంటుందని చెప్పారు. కలెక్టర్, రెవెన్యూ అధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. కార్పొరేటర్లు దేవరకొండ అశోక్, ఓబిలి రవిచంద్ర, నాయకులు నాగసుబ్బారెడ్డి, నాగభూషణం, భీముడు, నాగరాజు, హరి, జాకీర్, ఉస్మేరా, సుభాషిణి, బ్రహ్మారెడ్డి, జమీర్, కరిముల్లా, అధికారులు పాల్గొన్నారు.
Advertisement