అంత ఖర్చు ఆ ఐదు రోజులకేనా ?
-
బారా షహీద్ దర్గా వద్ద పూర్తి కావచ్చిన 120 మరుగుదొడ్ల నిర్మాణం
-
రొట్టెల పండుగ తర్వాత వీటి నిర్వహణపై గందరగోళం
-
దర్గా నిర్వాహకులకు అప్పగించాలని అధికారుల యోచన
-
ఈ భారం తమకు వద్దంటున్న దర్గా నిర్వాహకులు
-
ముందు చూపులేక పోతే రూ 84 లక్షలు వృథాగా మారే ప్రమాదం
రొట్టెల పండుగలో పాల్గొనడానికి తరలివచ్చే లక్షలాది మంది భక్తుల సదుపాయం కోసం రూ 84 లక్షలతో నిర్మిస్తున్న 120 మరుగుదొడ్ల నిర్వహణ విషయంలో గందరగోళం నెలకొంది. పండగ తర్వాత వీటిని దర్గాకు అప్పగించాలని కార్పొరేషన్ యోచిస్తుండగా, ఈ బాధ్యత తమకు వద్దని దర్గా నిర్వాహకులు చెబుతున్నారు. కార్పొరేషన్ మంచి ఆశయంతో ఖర్చు చేస్తున్న రూ 84 లక్షలు ఎందుకూ పనికి రాకుండా పోతాయా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సాక్షి ప్రతినిధి – నెల్లూరు
నెల్లూరు నగరం బారా షహీద్ దర్గా ఆవరణంలో ఈ నె ల 12 నుంచి 16వ తేదీ వరకు జరిగే రొట్టెల పండుగకు సుమారు 10 లక్షల మంది భక్తులు తరలి వస్తారని అధికారులు అంచనా వేశారు. ప్రతి యేడు లాగే ఈ సారి కూడా మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని తొలుత భావించారు. రూ 84 లక్షలతో రెండు బ్లాక్‌లుగా 12 మరుగుదొడ్లు నిర్మించడానికి అధికారులు ప్లాన్ రూపొందించారు. కౌన్సిల్ ఈ పనులకు ఆమోద ముద్ర వేసింది. పనులకు టెండర్లు పిలవడం, కాంట్రాక్టర్ పనులు ప్రారంభించడం చకచకా జరిగిపోయాయి. ఈనెల 10 తేదీ నాటికి 120 మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసి కార్పొరేషన్‌కు అప్పగించడానికి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేకంగా 40 మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. ఈ వ్యర్థాలన్ని చెరువులో కలవకుండా ప్రత్యేకంగా మూడు గుంతలు నిర్మించారు. ఒక్కో బ్లాక్‌లో 22వేల లీటర్ల సామర్థ్యంతో రెండు చొప్పున రెండు బ్లాక్‌లకు కలిపి 44వేల లీటర్ల సామర్థ్యంతో నాలుగు ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించారు. నగరంలోని బుజ్జమ్మ రేవు నుంచి ప్రత్యేకంగా పైప్‌లైన్ నిర్మించి నీటి సరఫరా చేయడానికి పనులు చేస్తున్నారు. రొట్టెల పండుగకు తరలివచ్చే భక్తులకు ఆ ఐదు రోజులు మరుగుదొడ్లు ఎంతో ఉపయోగ పడతాయి.
ఆ తర్వాత పరిస్థితి ఏమిటి ?
కార్పొరేషన్ లక్షల రూపాయలు ఖర్చు చేసి నగరంలో నిర్మించిన అనేక మరుగుదొడ్లు వృ«థాగా పడివున్నాయి. ప్రధాన కూడళ్లలోని మరుగుదొడ్లు మాత్రం సులభ్ సంస్థకు అప్పగించడంతో వినియోగదారుల నుంచి సొమ్ము వసూలు చేసి నిర్వహిస్తున్నారు. బారాషహీద్ దర్గా వద్ద రూ 84 లక్షలతో నిర్మిస్తున్న 120 మరుగుదొడ్లను సులభ్ లాంటి సంస్థలు తీసుకుని నిర్వహించే అవకాశం లేదు. రొట్టెల పండుగ తర్వాత ఇక్కడికి జనం పెద్దగా రారు. ఈ కారణంగా ఏ సంస్థ కూడా సొంతంగా డబ్బులు ఖర్చు చేసి మరుగుదొడ్లు నిర్వహించేందుకు ముందుకు వచ్చే అవకాశం లేదు. రొట్టెల పండుగ తర్వాత మరుగుదొడ్లను అలాగే వదిలేస్తే అందులోని కుళాయిలు, టైల్స్ కూడా పీక్కు పోయే ప్రమాదం వుంది. దీనికి తోడు ఇవి అసాంఘిక కార్యక్రమాలకు నిలయాలకుగా మారే అవకాశం ఉంటుంది. రూ 84 లక్షలు ఖర్చు చేసి మరుగుదొడ్లు నిర్మిస్తున్న కార్పొరేషన్ అధికారులకు వీటి నిర్వహణ ఎలా? అనే ఆందోళన పట్టుకుంది. పండగ తర్వాత వీటిని దర్గాకు అప్పగించాలని వారు భావిస్తున్నారు. అయితే దర్గా నిర్వాహకులు ఈ భారం తాము మోయలేమని చెబుతున్నారు. పండగ ఐదు రోజులు వీటిని బాగా ఉపయోగించి ఆ తర్వాత కార్పొరేషన్ వర్గాలు షరా మామూలుగా వీటి గురించి మరచిపోతే రూ 84 లక్షల ప్రజాధనం వృథాగా మారే ప్రమాదం వుంది.