విధి వంచితులు
♦ రెండు కిడ్నీలు చెడిపోయిన భర్త
♦ గుండె జబ్బుతో భార్య
♦ ఉపయోగపడని ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు
♦ నెలకు రూ. 7 వేలు మందుల ఖర్చు
వారిది పేద కుటుంబం. భార్యా భర్తలు కష్టపడితే గానీ ఇల్లు గడవదు. ఈ తరుణంలో కొండంత అవాంతరం వచ్చి పడింది. భర్తకు రెండు కిడ్నీలు చెడిపోయాయి. భార్యకు గుండె జబ్బు ఉంది. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో భార్యా భర్తలు.. వారి పరిస్థితిని చూసి పిల్లలు రోదిస్తున్నారు. మనసున్న మారాజులు దయతలచి
ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
ప్రొద్దుటూరు క్రైం: ప్రొద్దుటూరు ఈశ్వరరెడ్డినగర్‌కు చెందిన బెజవాడ సుబ్బరాయుడు పాత చీరెల వ్యాపారం చేస్తుంటాడు. అతనికి భార్య భాగ్యలక్ష్మి, కుమార్తె లక్ష్మిప్రసన్న, కుమారుడు శ్రీనివాసులు ఉన్నారు. కుమార్తె 10, కుమారుడు 8వ తరగతి చదువుతున్నారు. సుబ్బరాయుడు స్థానికంగానే పాత చీరెలు కొనుగోలు చేసి వాటిని విక్రయించడానికి పల్లెలకు వెళ్లి నాలుగైదు రోజుల పాటు అక్కడే ఉంటాడు. భార్య ఇంట్లోనే చీరెలకు ఫాల్స్ వేస్తుంటుంది.
ఉన్నట్టుండి మంచాన పడ్డాడు..
సుబ్బరాయుడుకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు. ఇటీవల కాలంలో ఏ రోజూ ఆస్పత్రికి వెళ్లినోడు కాదు. మూడు నెలల క్రితం అతనికి దగ్గు, ఆయాసం రావడంతో పట్టించుకోలేదు. మూడు రోజుల తర్వాత ఉన్నట్టుండి అతను కళ్లు తిరిగి పడిపోయాడు. వెంటనే ఒక ప్రైవేట్ డాక్టర్ వద్దకు వెళ్లగా 220/150 బిపి ఉందని చెప్పాడు. ఎందుకు బీపీ ఎక్కువ ఉందో నిర్ధారించుకోవడానికి డా క్టర్ ఈసీజీ చేయించుకోమని పంపించాడు. ఈసీజీలో ఎ లాంటి రిమార్కు లేదు, అంతా బాగానే ఉంది. తర్వాత గుండె సంబంధిత పరీక్షలు కూడా చేయించుకోగా అందు లో కూడా తేడా కనిపించలేదు. తర్వాత కిడ్నీ పరీక్ష చే యించుకోగా అందులో కిడ్నీలు చిన్నగా ఉన్నట్లు కనిపిం చాయి. దీంతో వెంటనే తిరుపతి స్విమ్స్‌కు వెళ్లారు.
పనికి రాని ఎన్టీఆర్ వైద్యసేవ కార్డు..
తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రికి వెళ్లగా పరిశీలించిన వైద్యులు రెండు కిడ్నీలు 70 శాతం మేర చెడిపోయాయని చెప్పారు. కేవలం 30 శాతం మాత్రమే చిన్నగా ఉన్నాయని చెప్పారు. సుబ్బరాయుడికి తెలియకుండానే రక్తకామెర్లు వచ్చాయని, దాని వల్ల బీపీ ఎక్కువై కిడ్నీలపై ప్రభావం చూపిందని వైద్యులు వివరించారు. కాగా సుబ్బరాయుడు ఎన్టీఆర్ వైద్యసేవ కార్డు తీసుకొని వెళ్లగా కేవలం పరీక్షలు మాత్రమే ఉచితంగా నిర్వహించారు. మందులు మాత్రం డబ్బు పెట్టి తీసుకోవాల్సిందేనని చెప్పారని సుబ్బరాయుడు అన్నాడు. నెలకు రూ.7 వేల మందులు అవసరం అవుతాయని అతను తెలిపాడు.
మా లాంటి పేదలకు వైద్యసేవ కార్డు ఉపయోగపడకుంటే ఎలా అని సుబ్బరాయుడు ఆవేదన చెందుతున్నాడు. గత మూడు నెలల నుంచి అతను ఇంట్లో నుంచి బయటికి వెళ్లే పరిస్థితి లేదు. పూర్తి విశ్రాంతి తీసుకోవడమే గాక ఎలాంటి వస్తువులు మోయరాదని వైద్యులు సూచించడంతో ఇంటికే పరిమితమయ్యాడు. రూ. 2 లక్షలు అప్పు చేసి తె చ్చిన చీరెలన్నీ అలానే ఇంట్లో ఉండిపోయాయి. దీంతో అప్పుకట్టమని బాకీ ఇచ్చిన వారు ఒత్తిడి తెస్తున్నారని భార్య భాగ్యలక్ష్మి రోదిస్తోంది. చేతిలో డబ్బు లేకపోవడంతో నెలలో 15 రోజుల మందులను మాత్రమే తెచ్చుకుంటున్నామని ఆమె ఆవేదన చెందుతోంది.
భర్త పరిస్థితి చూసి గుండె పోటు..
భర్త పరిస్థితిని చూసిన భాగ్యలక్ష్మికి గుండె పోటు వచ్చింది. దీంతో ఆమెను వెంటనే స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమెను పరిశీలించిన వైద్యులు వెంటనే హైదరాబాద్‌కు వెళ్లాలని సూచించారు. అయితే చేతిలో చిల్లి గవ్వ కూడా లేకపోవడంతో భాగ్యలక్ష్మిని ఎక్కడికీ తీసుకొని వెళ్లలేదు. భర్తను చూసి భార్య, భార్య పరిస్థితిని చూసి భర్త రోదిస్తున్నారు. తల్లి దండ్రులకు ఈ పరిస్థితి రావడంతో పిల్లలిద్దరూ తీవ్ర ఆవేదన చెందుతున్నారు. చదవాలని ఉన్నా చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నామని వారంటున్నారు. ఈ క్రమంలో సుబ్బరాయుడు కుటుంబం గడవడమే కష్టంగా ఉంది. మనసున్న మా రాజులు సాయం చేస్తే తల్లిదండ్రులను బతికించుకుంటామని పిల్లలు శ్రీనివాసులు, లక్ష్మీప్రసన్న కోరుతున్నారు.