మాతృదేవోభవ
మాతృదేవోభవ
Published Mon, Apr 10 2017 10:04 PM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM
- మంచాన పడిన అమ్మకు కుమారుడి సపర్యలు
- స్ఫూర్తిగా నిలిచిన పేద కుటుంబం
కర్నూలు (వైఎస్‌ఆర్ సర్కిల్): ఆధునిక జీవన శైలి..మారుతున్న నాగరిక ప్రపంచంలో తల్లిదండ్రులను పోషించలేక వసతి గృహాల్లోనూ, ఆశ్రమాల్లోనూ వదిలేస్తున్న ఘటనలను నిత్యం చూస్తూనే ఉన్నాం. అయితే ఓ నిరుపేద.. పదేళ్లుగా మంచాన పడిన తల్లికి సపర్యలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. కర్నూలు నగర శివారులోని జొహరాపురంలో నివాసముంటున్న చాట్ల ఓబులేసు, భాగ్యమ్మ దంపతులకు గత 35 ఏళ్ల క్రితం వివాహమైంది. రోజుకు రూ.250 కూలితో జీవనం సాగించే ఓబులేసు తండ్రి నాగన్న పదేళ్ల క్రితం మృత్యువాత పడ్డారు. అప్పటి నుంచి తల్లి సుబ్బమ్మ మంచం పట్టింది.
నడవలేని దీనస్థితికి చేరుకుంది. రోజు రోజుకు ఆరోగ్యం క్షీణించి సొంత పనులు కూడా చేసుకోలేని స్థితికి చేరుకుంది. ఈ స్థితిలో కుమారుడు.. అమ్మకు తోడుగా నిలిచాడు. ఆయన భార్య భాగ్యమ్మ సైతం సహకారం అందిస్తోంది. చీదరించుకోకుండా.. ముదిమిలో సుబ్బమ్మను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఆమె వైద్యం, తిండి, మందులు తదితర ఖర్చులకు కుమారుడు ఓబులేసు కూలి డబ్బులు సరిపోయేవి. ఈ నేపథ్యంలో తన పెద్దకుమారుడు నాగేశ్వరరావును పదో తరగతిలోనే చదువును మాన్పించారు. తండ్రి సూచనల మేరకు అతను కూడా కూలికి వెళ్తున్నాడు.
ప్రతి రోజూ తనకు, తన కుమారుడికి వచ్చే దినసరి కూలి రూ. 500లలో తల్లి ఆరోగ్యం కోసం రూ.200 వ్యయం చేస్తున్నట్లు ఓబులేసు చెప్పారు. తన రెండో కుమారుడు రామాంజనేయులు..డీఎడ్ చదువుతున్నాడని, కుమార్తె భారతి.. ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతోందని చెప్పారు. అమ్మకు కష్టకలకుండా చూసుకోవడంలో ఉన్న తృప్తి ఎక్కడా దొరకదని ఓబులేసు తెలిపారు.
Advertisement