అనుమానం పెనుభూతమై
⇒ భార్యను నరికి చంపిన భర్త
⇒ అనంతరం పోలీస్ స్టేషన్‌లో లొంగుబాటు
కష్ట సుఖాల్లో తోడునీడగా ఉంటానని పెళ్లి రోజు చేసిన బాసలను అతను మరిచి పోయాడు. అనుమానంతో విచక్షణ కోల్పోయాడు. కత్తితో భార్యను నరికి హత్య చేశాడు. భార్యను హత్య చేశానంటూ వీధిలోకి వచ్చి కేకలు వేసి పైశాచికత్వాన్ని చాటుకున్నాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. ఈ సంఘటన ఏర్పేడు మండలం కొత్తకండ్రిగ ఎస్టీకాలనీలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది.
ఏర్పేడు : భార్యను కత్తితో నరికి చంపిన సంఘటన ఏర్పేడు మండలంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. రేణిగుంట మండలం మల్లిమడుగు ఎస్టీ కాలనీకి చెందిన పంజాపి గోవిందయ్య కుమారుడు అయ్యప్ప(32)కి శ్రీకాళహస్తి మండలం మేలచ్చూరు ఎస్టీ కాలనీకి చెందిన పాముల మహాలక్ష్మి కుమార్తె ప్రభావతి(28)తో 8 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి చీరాలమ్మ(07), జయచంద్ర(05), హేమ(03) పిల్లలు ఉన్నారు. పెళ్లయిన నాటి నుంచి అయ్యప్ప భార్య ప్రవర్తనపై అనుమానించేవాడు. వేరేవారితో వివాహేతర సంబంధాలు ఉన్నాయని పేర్కొంటూ గొడవ పడేవాడు. మద్యం సేవించి వచ్చి భార్యను చితకబాదేవాడు. పిల్లలను చూసి ఆమె అన్ని బాధలను మౌనంగా భరిస్తూ వచ్చింది. ఏడాది క్రితం కుటుంబాన్ని ఏర్పేడు మండలం కొత్తకండ్రిగ ఎస్టీ కాలనీకి మార్చాడు. కొన్ని నెలల వరకు భార్యతో మంచిగా నడచుకున్నాడు. తర్వాత మళ్లీ అనుమానంతో వేధించడం మొదలుపెట్టాడు.
ఈ క్రమంలో ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో కత్తితో భార్యపై దాడి చేశాడు. మెడపై నరకడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. అనంతరం అను వీధిలోకి వచ్చి భార్యను నరికేశానంటూ కేకలు వేశాడు. అక్కడి నుంచి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. విషయాన్ని తెలుసుకున్న ఎస్‌ఐ రామకృష్ణ అర్ధరాత్రి వేళ సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికులను విచారించారు. రేణిగుంట రూరల్ సీఐ సాయినాథ్ సోమవారం ఉదయం మృతదేహాన్ని పరిశీలించారు. పంచనామా అనంతరం పోస్టమార్టం కోసం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
ఎంపీటీసీల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పరామర్శ
స్థానిక ఎంపీటీసీ సభ్యుడు, ఎంపీటీల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు తోటకూర కోటేశ్వరరావు మండలంలోని కొత్తకండ్రిగ ఎస్టీ కాలనీకి వెళ్లి పిల్లలను పరామర్శించారు. సాయం చేస్తానని చెప్పారు.