హైటెక్‌ హంగులతో మెట్రో రైలు | Hyderabad Metro Rail | Sakshi
Sakshi News home page

హైటెక్‌ హంగులతో మెట్రో రైలు

Published Tue, Dec 13 2016 1:07 AM | Last Updated on Tue, Oct 16 2018 5:16 PM

హైటెక్‌ హంగులతో  మెట్రో రైలు - Sakshi

హైటెక్‌ హంగులతో మెట్రో రైలు

మన మెట్రో రైలు ప్రాజెక్టులో విశేషాలెన్నో...
హైటెక్‌ హంగులు...అత్యాధునిక వసతులు
ప్రపంచ స్థాయి ప్రాజెక్టుగా రూపకల్పన


సిటీజనుల కలల మెట్రో రైలు ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు ముహూర్తం ఖరారైంది. ఆధునిక సాంకేతికత, అత్యాధునిక వసతులతో పట్టాలెక్కనున్న నగర మెట్రో ప్రాజెక్టులో ప్రతిదీ ఒక విశేషమే. ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 మహానగరాల్లో మెట్రో ప్రాజెక్టులుండగా...వాటిలోని విశిష్టతలన్నింటినీ ఒక్కచోట చేర్చినట్లుగా మన  ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. సింగపూర్, హాంకాంగ్, షాంఘై, లండన్‌ వంటి విశ్వనగరాల మెట్రో ప్రాజెక్టులకు తీసిపోని విధంగా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. స్టేషన్లు, కోచ్‌లు, పట్టాలు, పార్కింగ్‌ వసతులు, మెట్రో మాల్స్, అందులోని సకల సదుపాయాలు.. ఒకటేమిటీ అన్నింటా ప్రత్యేకమే. ఉగ్రపంజా నేపథ్యంలో అత్యాధునిక భద్రతా ప్రమాణాలు, సీసీటీవీల నిఘా, బ్యాగేజి తనిఖీ యంత్రాలు ప్రతి స్టేషన్‌లోనూ ఉండనున్నాయి. స్టేషన్‌కు చేరుకునేందుకు ఎస్కలేటర్లు, లిఫ్టులు, దివ్యాంగులకు ప్రత్యేకమైన ఏర్పాట్లున్నాయి. ఆధునిక టికెట్‌ విక్రయ యంత్రాలు, నగదురహిత ప్రయాణానికి ఉపయోగపడే మెట్రో కార్డులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మొత్తం మూడు కారిడార్ల పరిధిలో తొలివిడత నాలుగు చోట్ల బడా మెట్రో మాల్స్‌ నిర్మించనున్నారు. హైటెక్‌సిటీ, పంజగుట్ట, ఎర్రగడ్డ, మూసారాంబాగ్‌ ప్రాంతాల్లో వీటి నిర్మాణం చేపట్టనున్నారు. ప్రస్తుతం పనులు ఊపందుకున్నాయి. మొత్తం మూడు కారిడార్లలో 73 కి.మీ మార్గంలో ఏర్పాటుకానున్న మెట్రో ప్రాజెక్టులో విశేషాలపై ‘సాక్షి’ ఫోకస్‌...


సాక్షి, సిటీబ్యూరో: మెట్రో స్టేషన్లకు వచ్చే ప్రయాణికులకు పార్కింగ్‌ సమస్య లేకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ద్విచక్రవాహనాలు, కార్లను మెట్రో స్టేషన్లకు సమీపంలో హెచ్‌ఎంఆర్‌ సంస్థ ఏర్పాటు చేసిన పార్కింగ్‌ స్థలంలో నిలిపి అక్కడి నుంచి స్టేషన్‌కు నడుచుకుంటూ వెళ్లి మెట్రో రైళ్లలో ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నారు. ముందుగా 57 ఎకరాల విస్తీర్ణంలో 17 చోట్ల పార్కింగ్‌ స్థలాలను ఖరారు చేసినట్లు హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. ప్రయాణికుల రద్దీ అధికమైతే  మూడు కారిడార్లలో మొత్తం 72 కి.మీ మెట్రో మార్గంలో మరో 14 చోట్ల ప్రైవేటు స్థలాలను లీజు లేదా శాశ్వత ప్రాతిపదికన తీసుకొనైనా ప్రయాణికులకు పార్కింగ్‌ వసతులు కల్పిస్తామని స్పష్టం చేశారు. ప్రయాణికులు ఇబ్బంది పడకూడని విధంగా మరిన్ని పార్కింగ్‌ స్థలాల సేకరణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

మినీ బస్సుల కొనుగోలు ఎప్పుడో..
వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని గణనీయంగా తగ్గించడం,నగరంలో ట్రాఫిక్‌ జాంఝాటం లేకుండా చేయాలన్న సంకల్పంతోనే మెట్రో ప్రాజెక్టు పట్టాలెక్కిన విషయం విదితమే. ప్రయాణికులు తమ ఇళ్లలోనే సొంత వాహనాలను నిలిపి హెచ్‌ఎంఆర్‌ నడిపే మెర్రీ గో అరౌండ్‌ మినీ బస్సుల్లో స్టేషన్లకు చేరుకునే అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. కానీ ప్రారంభం తేదీ ఖరారైనా బస్సుల కొనుగోలు ప్రక్రియ మాత్రం పూర్తికాలేదు. ప్రస్తుతం అదే పనిలో నిమగ్నమైనట్లు అధికారులు తెలిపారు. త్వరలో ఈ విషయంపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. కాగా మెట్రో స్టేషన్ల నుంచి మినీ బస్సులు అందుబాటులో లేని పక్షంలో ఆటోలు,వ్యక్తిగత వాహనాలను ఆశ్రయించక తప్పని పరిస్థితి నెలకొంటుంది. దీంతో ప్రయాణీకులు ఇటు ఆటో ఛార్జీలు,పార్కింగ్‌ ఛార్జీలు,ఇంధనం ఖర్చుల రూపేణా జేబులు గుల్ల చేసుకునే దుస్థితి ఏర్పడుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రయాణ ఛార్జీలు, పార్కింగ్‌ ధరలపై నిర్ణయం
మెట్రో ప్రాజెక్టు పనులు ప్రారంభానికి ముందే ప్రయాణీకుల ఛార్జీలు,పార్కింగ్‌ ఫీజులు నిర్ణయించారు. ప్రభుత్వం ప్రకటించే టోకు ధరల సూచీ ఆధారంగా ఈ ఛార్జీల్లో మార్పులు చేర్పులుంటాయని నిర్మాణ ఒప్పందంలో పేర్కొన్నారు. ఈనేపథ్యంలో ప్రారంభం అయ్యే నాటికి టిక్కెట్‌ ధరలు,పార్కింగ్‌ ఛార్జీల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఛార్జీల పెంపు అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.  
లగేజి: పది కేజీల వరకు ఉచితం. ఆపైన ప్రతి కిలోమీటర్‌కు ఒక రూపాయి.

పార్కింగ్‌ బాదుడే...
కార్లు:
రెండు గంటల వరకు రూ.10, ప్రతి అదనపు గంటకు రూ.5
ద్విచక్రవాహనాలు:
రెండు గంటల వరకు రూ.4. ప్రతిఅదనపు గంటకు రూ.2
మెట్రో రైళ్ల వేగం:
గరిష్ఠం: గంటలకు 80 కిలోమీటర్లు. సగటు వేగం: 34 కి.మీ.
భద్రతా ప్రమాణాలివే..
మెట్రో రైలు స్టేషన్లలో సీసీటీవీలతో నిరంతర నిఘా
మెట్రో రైళ్లు పట్టాలు తప్పకుండా ఉండేందుకు అధునాతన చెక్‌రైల్‌ సాంకేతికతను వినియోగించి పట్టాలను పరీక్షించారు.
మెట్రో రైలు కోచ్, డ్రైవర్‌ క్యాబిన్‌లలో అగ్ని నిరోధక సాధనాలు, ఆక్సిజన్‌ సిలిండర్లుంటాయి.
ఊహించని ప్రమాదాలు జరిగినపుడు రైళ్లు వాటంతట అవే ఆగుతాయి.

వసతులు ఇవే..
ప్రతి మెట్రో కోచ్‌లో 40 మంది కూర్చునేందుకు, మరో 300 మంది సౌకర్యవంతంగా పట్టుకొని నిల్చునేందుకు గ్రాబ్‌పోల్స్‌ ఉంటాయి.
చ్‌ లోపలి భాగం స్టార్‌హోటళ్లలోని ఏసీ రూమ్‌ను తలపిస్తుంది.

బయటి వాతావరణానికి తగినట్లుగా కోచ్‌లో ఏసీ పనిచేస్తుంది. బయట వేడిగాఉంటే ఏసీ పెరుగుతుంది. వేడి తగ్గితే కోచ్‌లో చల్లదనం ఆమేర ఉంటుంది. మొబైల్, ల్యాప్‌టాప్‌ ఛార్జింగ్‌ పాయింట్లుంటాయి.

ప్రతి కోచ్‌లో ఎల్‌సీడీ తెరలుంటాయి. ఇందులో సినిమాపాటలు, వ్యాపార, వాణిజ్య ప్రకటనలను వీక్షించవచ్చు.
ప్రతి స్టేషన్‌ రాగానే కోచ్‌లో అందరికీ వినిపించేలా అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది.
ప్రతి కోచ్‌లో రైలు ప్రయాణించే మార్గాన్ని ఎల్‌సీడీ తెరల్లో కనిపించేలా ప్రదర్శిస్తారు.  


‘మెట్రో’ మాల్స్‌ ఇక్కడే..
ఏర్పాటుచేసే ప్రాంతం    ఎకరాలు    విస్తీర్ణం సుమారుగా
1.హైటెక్‌సిటీ ఎదురుగా    2     2 లక్షల చదరపు అడుగులు
2.పంజగుట్ట మెట్రోజంక్షన్‌     4    4 లక్షల చదరపు అడుగులు
3. ఎర్రగడ్డ మెట్రోస్టేషన్‌    4    4 లక్షల చదరపు అడుగులు
4.మూసారాంబాగ్‌ మెట్రోస్టేషన్‌    4    4 లక్షల చదరపు అడుగులు

మాల్స్‌లో ప్రత్యేకతలు ఇవీ...
ఆఫీసు, వాణిజ్య స్థలాలు
ఫుడ్‌కోర్టులు, చాట్‌బండార్స్, బేకరీలు, కన్‌ఫెక్షనరీలు
దేశ, విదేశీ హోటళ్లు,కెఫెటేరియాలు, ఐస్‌క్రీం పార్లర్లు
డ్యూటీ ఫ్రీ షాప్‌లు
బ్రాండెడ్‌ దుస్తుల దుకాణాలు, ఫ్యాక్టరీ ఔట్‌లెట్లు
సుగుంధ ద్రవ్యాలు, డ్రైఫ్రూట్స్, పెర్‌ఫ్యూమ్స్‌ కేంద్రాలు
ట్రామాకేర్, డయాగ్నోస్టిక్స్‌ సెంటర్లు,

ఆక్సిజన్‌ సెంటర్స్‌
బ్యాంకులు, ఏటీఎంలు, బుక్‌ స్టోర్స్‌
గేమింగ్‌ జోన్స్, స్కేటింగ్, స్నూకర్, వీడియో గేమ్స్‌
అన్ని నిత్యావసరాలు దొరికే ఏ టు జడ్‌ స్టోర్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement