!['నేనెక్కడికీ పారిపోలేదు.. కోర్టుకు హాజరవుతా' - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/41451977368_625x300.jpg.webp?itok=qy10PKJB)
'నేనెక్కడికీ పారిపోలేదు.. కోర్టుకు హాజరవుతా'
విజయవాడ: కల్తీ మద్యం ఘటన జరిగిన తర్వాత తాను పరారీలో ఉన్నమాట అవాస్తవం అని కాంగ్రెస్ పార్టీ నేత మల్లాది విష్ణు అన్నారు. తాను రేపు కోర్టుకు హాజరు అవుతానని చెప్పారు. కృష్ణలంకలో గల స్వర్ణ బార్‌లో కల్తీ మద్యం సేవించి ఐదుగురు ప్రాణాలు విడవగా, మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం విదితమే. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపింది.
మల్లాది విష్ణు ఈ కేసులో తొమ్మిదో నిందితుడిగా ఉన్నారు. అయితే, ఈ ఘటన జరిగిన వెంటనే మల్లాది విష్ణు కనిపించకుండా వెళ్లారు. తాజాగా అజ్ఞాతం వీడిన ఆయన తాను పరారీలో ఉన్నది అవాస్తవం అని చెప్పారు. కొన్ని కార్యక్రమాల దృష్ట్యా తాను వెళ్లాను తప్ప ఎక్కడికీ పారిపోలేదని చెప్పారు. మద్యం కేసులో తనకు నోటీసులు అందాయని చెప్పిన ఆయన ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే రేపు కోర్టు విచారణకు హాజరవుతానని చెప్పారు. ఈ సందర్భంగా విజయవాడలోని తన నివాసంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో విష్ణు సమావేశం నిర్వహించారు.